హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా చానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు, ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడింది. కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేసింది.
కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పద్మారావుగౌడ్, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారని తెలిపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం మీడియా సంస్థలకు విడుదలచేసింది. వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలు ప్రసారం చేయాలని సూచించింది.