Global Summit | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజునే ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అయితే, అట్టర్‌ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్‌బస్టర్‌గా ప్రమోట్ చేసుకొన్నట్టు.. నీరసించిన సమ్మిట్‌ను రక్తికట్టిందని చెప్పడానికి రేవంత్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం తన అనుకూల పత్రికలతో అబద్ధపు రాతలను రాయించింది. గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజునే రాష్ర్టానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయా ఆస్థాన పత్రికలతో ఊదరగొట్టించింది. అంతేనా.. జాతీ య పత్రికల్లో వచ్చిన పెట్టుబడుల లెక్కలను 2, 3 రెట్లు పెంచి గారడీ చేయించింది. పెట్టుబడుల లెక్కలన్నీ తప్పేనని, వచ్చిన ఆ కంపెనీలూ బోగస్వేనంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు.

సోమవారం ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడుల మేర ఒప్పందాలు జరిగాయని జాతీయ పత్రిక ‘ది హిందూ’ ప్రచురించింది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకే ఈ కథనాన్ని ఇచ్చినట్టు కూడా తెలియజేసింది. ఇక, మరో జాతీయ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’.. రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఓ కథనంలో పేర్కొన్నది. అయితే, పెట్టుబడులను మరింత పెంచాలన్న అత్యుత్సాహం చూపిన రేవంత్ ప్రభుత్వ బాకా పత్రికలు.. ఈ అంకెలను రెండు, మూడింతలు చేసి చూపించాయి. వెలుగు, దిశ పత్రికలతో పాటు ఆంధ్రజ్యోతి కూడా తొలిరోజున రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రచురిస్తే.. ఈనాడు మరో అడుగు ముందుకేసింది. తొలిరోజున ఏకంగా రూ.3,97,500 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాసింది. ఇలా మొత్తంగా స్థానిక పత్రికలు పెట్టుబడులపై ఓ కనికట్టు చూపించాయి.
ఒక్కో పత్రికలో పెట్టుబడుల లెక్కలు ఒక్కోవిధంగా ఉండటం, ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన సంస్థలపై అక్రమాల ఆరోపణలు ఉండటంతో రేవంత్ ప్రభుత్వంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.లక్ష విలువ చేయని కంపెనీలు రూ.వందల కోట్లల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేయడంపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.