దుండిగల్, మార్చి 9: నకిలీపత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని కర్నూలు జిల్లా, జంజర్లకు చెందిన ఆలూరి మాదన్నకు తన గ్రామంలో ఏ డెకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో పత్తి పండించాడు. పత్తిని కర్ణాటక రాష్ట్రం గజేంద్రగాడాలోని జిన్నింగ్ మిల్లుకు తీసుకువెళ్లి విత్తనాలను, పత్తిని వేరుచేయించాడు. ఈ విత్తనాలకు రంగులు కలిపి అధిక ధరకు విక్రయించేందుకు మల్లంపేట వ్యవసాయ విత్తనాల విక్రయ కేంద్రంలో విక్రయించేందుకు ఆదివారం వస్తున్నట్టు కుత్బుల్లాపూర్ వ్యవసాయ అధికారితో పాటు ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది.
ఆదివారం పోలీసులు బాచుపల్లి-మల్లంపేట రోడ్డులో నిఘాపెట్టగా మల్లంపేట నుంచి బాచుపల్లి వైపు ఓ ట్రాలీ ఆటో అనుమానాస్పదంగా వస్తుండడంతో తనిఖీ చేయగా 15 బస్తాల పత్తి విత్తనాల సంచులు లభించాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మాదన్నతోపాటు, ఆటో డ్రైవర్ చావిట్ల ఆదర్శ్, మరో రైతు గొల్ల ఉదయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. పత్తి విత్తనాలకు రంగులు కలిపి మార్కెట్లో విక్రయించేందుకు వచ్చినట్టు తేలడంతో 745 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. కుత్బుల్లాపూర్ వ్యవసాయ అధికారి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు మాదన్నను యాలాల్ పోలీసులు గతంలోనూ అరెస్టు చేసినట్టు తేలింది. ఆటో డ్రైవర్ ఉదయ్ కర్నూలు జిల్లా ఆలూరు మం డలం మొలగవల్లికి చెందినవారిగా గుర్తించారు.
కన్నెపల్లి, మార్చి 9 : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సుర్జాపూర్లోని బేరి నారాయణ ఇంట్లో తనిఖీలు చేయగా, 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డట్టు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఐ గంగా రాం, వ్యవసాయాధికారి సాయిప్రశాంత్ సూర్జాపూర్లో తనిఖీలు నిర్వహించగా, నారాయణ ఇంట్లో రూ. 3.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు లభించినట్టు పేర్కొన్నారు. కొండగుర్ల రాజన్న, సురేశ్ వద్ద బేరి నారాయణ ఈ నకిలీ విత్తనాలు తీసుకున్నట్టు తెలిపారు. నకిలీ విత్తనాలతో పాటు నారాయణ, రాజన్నను అదుపులోకి తీసుకున్నామని, సురేశ్ పరారీలో ఉన్నారని చెప్పారు.