హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల టౌన్/జనగామ చౌరస్తా, అక్టోబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఘోర అవమానం ఎదురైంది. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను అనుమతించకపోవడంతో వారితోపాటు వారి తల్లిదండ్రులు జగిత్యాల, జనగామ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగారు. జగిత్యాల విద్యానగర్‌లోని శ్రీచైతన్య, చుక్కా రామయ్య, రాజారాంపల్లిలోని అక్షర స్కూల్, మల్యాలలోని వాగ్దేవి, కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని వాసవి స్కూళ్లు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ద్వారా ఎంపికైన విద్యార్థులను సోమవారం పాఠశాలల నుంచి బయటకు పంపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం ఇవ్వడానికి జగిత్యాల కలెక్టరేట్లోని ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసుకు వెళ్లగా వినతిపత్రాన్ని తీసుకునేందుకు సిబ్బంది తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కలెక్టరేట్ ఎదుట, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ కూడలిలోని జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్ర భుత్వం నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. జనగామ జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్) కింద చదువుకుంటున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఆయా పాఠశాలలు నిరాకరించడంతో వారితోపాటు వారి తల్లిదండ్రులు జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. దళిత, గిరిజన వర్గాల విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని వారు ఈ సందర్భంగా హితవు పలికారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు వాతాల ఆగయ్య, బిర్రు నగేశ్, ప్రవీణ్, కిశోర్, భూక్యా రాజు, తిరుపతి, రాజు, రవీందర్, సంతోశ్, తూడి మౌనిక, తాళ్లపల్లి అనూష, లావణ్య, విమల, కోమలత, కృష్ణవేణి, వాణి పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన చిన్నారులకు ఉచిత ప్రైవేట్, కార్పొరేట్ విద్యను అందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకాన్ని గత 17 ఏండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి జిల్లాల పరిధిలోని ప్రైవేట్ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేయిస్తాయి. వారికయ్యే ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రాథమిక తరగతి విద్యార్థికి ఏటా రూ.28,000, ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థులకు (వసతితో కలిపి) రూ.42,000 చొప్పున చెల్లిస్తారు. ఫీజుల చెల్లింపుతోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం వంటి వాటిని సైతం విద్యార్థులకు ఉచితంగా సర్కారే అందిస్తుంది. ఈ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీలు కలిపి 26,000 మంది విద్యార్థులు పూర్తి ఉచిత విద్యను పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలలుగా ఈ స్కీమ్‌కు సంబంధించి రూ.220 కోట్ల నిధులను ప్రభుత్వం బకాయి పెట్టింది. నిధులను విడుదల చేయాలని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు సుదీర్ఘకాలంగా మొరపెట్టుకుంటున్నాయి. కానీ సర్కారులో మాత్రం ఏమాత్రం చలనం రాలేదు. దీంతో యాజమాన్యాలు సోమవారం పాఠశాలల్లోకి దళిత, గిరిజన విద్యార్థులను అనుమతించలేదు. పాఠశాల గేట్ల బయటనే నిలబెట్టాయి. ప్రభుత్వం నిధులను విడుదల చేసేవరకూ తీసుకు రావొద్దంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్పాయి. స్కీమ్ చరిత్రలోనే ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఇలాంటి అవమానం ఎదురుకావడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించిన బకాయి నిధులను ప్రభుత్వం సత్వరమే చెల్లించాలని తెలంగాణ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరేంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే విద్యార్థులతో కలిసి వచ్చి సెక్రటేరియట్‌ను ముట్టిస్తామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏండ్లుగా నిధులను విడుదల చేయకపోవడంతో పాఠశాలలను నిర్వహించలేకపోతున్నామని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయని, నిధులిచ్చే వరకూ విద్యార్థులను అనుమతించబోమని చెప్పాయ ని, దీంతో తమ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి, నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను జగిత్యాల జిల్లా స్కూళ్ల యాజమాన్యాలు అనుమతిని నిరాకరిస్తే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించా రు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల నిర్వహణలో సర్కారు విఫమైందని ధ్వజమెత్తారు. విద్యార్థులను బయటకు పంపడం బాధాకరమని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోడంతోనే పేదింటి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య, వసతి కల్పించేవారని, ఏటా నగదును చెల్లించేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి బిల్లులు చెల్లించి స్కూళ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మా పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలించొద్దు
సిర్పూర్(టీ), అక్టోబర్ 6 : ‘మా పిల్లల ను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలకు తరలించవద్దు’ అంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట సోమవారం తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిర్పూర్(టీ) గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాసిపేట, జైపూర్, మెట్‌పల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలకు రెండు నెలల క్రితం తరలించారు. విద్యార్థులకు సిర్పూర్(టీ)లోనే తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కొన్నిరోజులుగా విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారు ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వీడియో కాల్లో మాట్లాడారు. ఎస్ఐ సురేశ్ తల్లిదండ్రులతో మా ట్లాడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.