నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) వద్ద శనివారం కొంత మంది దుండగులు అర్ధరాత్రి దారి దోపిడీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద రోడ్డు పక్కన కాపుకాసి రాళ్ల దాడికి దిగారు. ఏం జరుగుతుందో తెలియక ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బస్సు వేగాన్ని పెంచడంతో దుండగుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి.
రాళ్ల దాడిలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. 100 కు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో స్టేషన్ కి వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ ఘటనపై ఫిర్యాదు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు ప్రయాణికులకు ప్రథమ చికిత్స చేయించి అదే బస్ లో పంపించారు.