CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అనుకూల ఒక టీవీ చానల్ శనివారం నిర్వహించిన పోల్‌లో రేవంత్ సర్కార్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. 11 నెలల రేవంత్ సర్కారు పాలన ఎలా ఉన్నదంటూ సదరు టీవీ చానల్ ఎక్స్ వేదికగా పోల్ నిర్వహించింది. దీనికి 61% మంది రేవంత్ సర్కారు పాలన బాగోలేదని తేల్చిచెప్పారు.
12% మంది ఏమీ చెప్పలేమని బదులిచ్చారు. కేవలం 27% మంది కాంగ్రెస్ పాలన పర్వాలేదని జవాబిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ‘ఎక్స్’ ఖాతా నుంచి ఆ పోల్‌ను సదరు మీడియా చానల్ 45 నిమిషాల్లోనే తొలగించింది.
పోల్ కొనసాగిన దాదాపు 45 నిమిషాల వ్యవధిలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను నెటిజన్లు కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఆరు గ్యారెంటీల పేరిట రేవంత్ ప్రభుత్వం తమను మోసం చేసిందని దీపక్ అనే నెటిజన్ కామెంట్ చేయగా, హైడ్రా కూల్చివేతలతో మధ్యతరగతి కలలను కాంగ్రెస్ సర్కారు చిదిమేసిందంటూ నరోత్తమ్ అనే మరో నెటిజన్ వాపోయాడు.
ధాన్యం కొనకుండా రైతన్న కన్నీరుకు ప్రభుత్వం కారణమైందంటూ కిరణ్ అనే వ్యక్తి ఖాతా నుంచి పోస్ట్ కనిపించగా, మూసీ పరివాహకంలోని పేదల ఇండ్ల కూల్చివేత, లగచర్ల హింసాత్మక ఘటనలు కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠను దిగజార్చాయంటూ నాని అనే మరో నెటిజన్ పేర్కొన్నారు.