దండేపల్లి, జూలై18 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరుకున్నది. నివురు గప్పిన నిప్పులా ఉన్న కోల్డ్‌వార్ పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటనతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయింది. దండేపల్లి మండలం గూడెంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ కార్యకర్త చింతం మల్లేశ్ కుటుంబానికి పరామర్శతో పాటు స్థానిక పాఠశాలలో వివేకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు వందలాదిగా గూడెం గ్రామానికి చేరుకుని తమకు తెలువకుండా మంత్రి, ఎంపీ పర్యటనలు ఉండటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.
అక్కడ ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఎంపీ వంశీకృష్ణ కాంగ్రెస్ కార్యకర్త చింతం మల్లేశ్ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీ కాన్వాయ్ వైపునకు దూసుకు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాన్వాయ్కి రక్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే చాలా బాధ కలుగుతున్నదని, ఇటువంటి ఘటనలు జరుగకుండా పార్టీ పెద్దలు చూసుకోవాలని సూచించారు.