రాష్ట్రంపై మొంథా తుపాను పంజా విసిరింది. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకొని.. మంగళ, బుధవారాల్లో కురిసిన ఎడతెరిపి లేని వానలతో హైదరాబాద్ సహా పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. కొనుగోళ్లలో సర్కారు అలసత్వం కారణంగా భారీ వర్షాలకు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయి రైతులకు కన్నీళ్లే మిగిలాయి.
రాష్ట్రంలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఉమ్మడి వరంగల్‌పై తుపాను తీవ్రం ప్రభావం చూపింది. పలు జిల్లాలను వరద ముంచెత్తింది. రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రహదారులు తెగిపోయి రవాణా స్తంభించింది. 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచిఉన్నదని హెచ్చరించిన వాతావారణ శాఖ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 29: మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దంచికొట్టిన వానతో రహదారులపై మోకాళ్ల లోతు వరద చేరడంతో ప్రధాన జంక్షన్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. హంటర్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు, హనుమకొండ చౌరస్తా, బస్‌స్టేషన్ రోడ్డు, అంబేద్కర్ జంక్షన్ ప్రాంతాలతోపాటు వరంగల్ అండర్‌బ్రిడ్జి, చిన్నబ్రిడ్జి, వరంగల్ చౌరస్తా, హెడ్ ఫోస్టాఫీస్ జంక్షన్, పాతబీటు బజార్, బట్టల బజార్, ఆర్టీఏ కార్యాలయం జంక్షన్లు జలమయమయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు కాజ్వే పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో రైలు పట్టాలపైకి వరద చేరింది. దీంతో రైళ్లను ఎకడికకడే నిలిపివేయగా ప్రయాణికులకు పోలీసులు బిస్కట్లు, తాగునీటిని అందించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేసిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను తిరిగి వరంగల్ వైపు పంపించారు. ఈ రైలులో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారు అధికంగా ఉండటంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో లింగాల గట్టు వద్ద, అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూల్, అచ్చంపేట పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. దుందుభీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద కల్వర్టు కూలడంతో శ్రీశైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.

అచ్చంపేట మండలం మార్లపాడు తండా నక్కలగండి రిజర్వాయర్‌లోకి నీరు చేరడంతో పునరావాస తండాను నీళ్లు చుట్టుముట్టాయి. ఇళ్లల్లోకి మోకాల్లోతు నీళ్లు చేరడంతో 100 ఇండ్లల్లో ఉన్న 200 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వర్షాలు ముంచెత్తాయి. పాపటపల్లి వద్ద బుగ్గవాగు పొంగి పొర్లడంతో పాపటపల్లి-వీఆర్ బంజరకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు జీవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలలో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్లో ట్రాక్‌పైకి వరద చేరడంతో కాకినాడ నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను మధిరలోనే నిలిపివేశారు. తర్వాత విజయవాడ మీదుగా ఆ రైలును దారి మళ్లించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా.. డ్రైవర్ నీటిలో గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్, తొర్రూరు గ్రామాల మధ్య వరద తీవ్రతకు కారు నీట మునిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్కు చెందిన నర్సయ్య ప్రమాదవశాత్తు కాగ్నా వాగులో కొట్టుకుపోతుండగా తాండూర్ మండలం వీర్‌శెట్టిపల్లి సమీపంలోని బ్రిడ్జి సమీపంలో ఓ ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో కాపాడారు.నీట మునిగిన గురుకులాలు
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మెపల్లిలోని బాలుర గిరిజన పాఠశాల పరిసర ప్రాంతం పూర్తిగా వరదముంపులో చిక్కుకుపోయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను తాడు సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చి సీపంలోని బీసీ గురుకులానికి తరలించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ భవనం చుట్టూ వర్షపు నీరు చేరడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చెట్టు కూలి వ్యక్తి దుర్మరణం
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా సూర్యాపేట, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరింది. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో కొత్తబడి సమీపంలో చెట్టు కూలడంతో మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ దుర్మరణం చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో 21.28 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది.

