హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జీనజీవనం స్తంభిస్తుంది. ఈ నెల 18,23 తేదీల్లో బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తెలుగు రాష్ర్టాల్లో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.
వర్షాలు కురుస్తున్న సమయం లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వివరించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 17.22 సెం.మీ, తలమడుగులో 16.49 , మావలలో 16.04, సాత్నాలలో 15.6, సిరికొండలో 14.81, గుడిహత్నూర్లో 14.70 సెంటీమీటకంల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. రాష్ట్రంలోని 84 మండలాల్లో 60శాతంపైగా, 205 మండలాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది..