Summer Effect | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటం, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నుంచే ఎండలు ముదరడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా చేపల ఎదుగుదల తగ్గడం, వాటికి మార్కెట్లో సరైన రేటు లభించకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలో చేపల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది.
కానీ, ఈసారి ఆ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు వేగంగా ఇంకిపోతుండటంతో చేపలు చనిపోతున్నాయి. మిగిలిన చేపలు సైతం సరిగ్గా ఎదగలేదు. అవి కూడా చనిపోతాయన్న భయంతో మత్స్యకారులు వాటినే పట్టి, మార్కెట్కు తరలిస్తున్నారు. కనీసం కిలో బరువు కూడా లేని ఆ చేపలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో రూ.50 ధర కూడా పలకడం లేదు. దీంతో పొద్దంతా చేపలు పడితే కనీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఎండల వల్ల మత్స్య పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొంటూ.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
సూర్యపేట జిల్లా నాగారం మండలంలోని 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈటూరు పెద్దచెరువులో ఈ ఏడాది రూ.15 లక్షల విలువైన 10 లక్షల చేపపిల్లను వదిలాం. ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ఆ చెరువులోని కొన్ని చేపలు బయటికి వెళ్లిపోయాయి. మిగిలిన చేపలు సరిగా పెరగలేదు. ఏప్రిల్, మే నెలల్లో చెరువుల నిండా నీరు ఉంటే చేప పంట చేతికి వస్తుంది. ఒక్కో చేప కనీసం 2 కేజీలు ఉంటే గిట్టుబాటు అవుతుంది. కానీ, ఇప్పటివరకు అరకేజీ సైజు కూడా రాలేదు. దీంతో కనీసం పెట్టుబడి సొమ్ము కూడా దక్కే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే మూసీ నీటితో చెరువును నింపి మత్స్యకారులను ఆదుకోవాలి.
– పెద్దపల్లి యాదగిరి, ఈటూరు మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం, సూర్యాపేట జిల్లా)