హైదరాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ పొడిగించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, అర్హత పొందిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కానీ, ప్రతివాదులు రాతపూర్వక వాదనలు సమర్పించకపోవడంతో తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
గ్రూప్-1 మెయిన్స్ జ వాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో తిరిగి మూల్యాంకనం చేశాక ఫలితాలు వెల్లడించాలని, ఆ తర్వాత నియామకాలు చేయాలని, లేనిపక్షంలో మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ తరఫున వాదించేందుకు సిద్ధమని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి తాజాగా హైకోర్టుకు తెలిపారు. కానీ, పిటిషనర్లు రాతపూర్వక వాదన లు దాఖలు చేయనందున విచారణ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ధ ర్మాసనం.. అప్పటివరకు మధ్యంతర ఉ త్తర్వులను పొడిగిస్తున్నట్టు తెలిపింది.