హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో ఎక్స్టెన్షన్ విధానాన్ని నిలిపివేయాలని టీజీవో సెంట్రల్ అసోసియేషన్ నేతలు కోరుతూ మంగళవారం నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు వినతిపత్రం అందజేశారు. డిపార్ట్మెంట్లో ఒక చీఫ్ ఇంజినీర్ పోస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆరుగురి ప్రమోషన్లు అడ్డుకున్నట్టేనని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎక్కువకాలం సర్వీస్ చేసినా ప్రమోషన్ లేక దాదాపు 200 మంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. దీనిపై రాహుల్ బొజ్జా సానుకూలంగా స్పందించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీజీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రామారావు, ఏటీఏఈఈ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ నాగరాజు పాల్గొన్నారు.
సీఎస్సార్ తరహాలో ఏఎస్సార్ ; ఆ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) తరహాలో రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్సార్) విధానం అమల్లోకిరానుంది. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నది. రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఇండస్ట్రీ నిపుణులతో పాఠాలు చెప్పించాలనుకుంటున్నది. రాష్ట్రంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ లేమి పట్టిపీడిస్తున్నది. దాదాపు 2వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో రిటైర్మెంట్లు ఊపందుకున్నాయి. ఓయూ, కాకతీయ వంటి కీలక వర్సిటీల్లోనూ బోధన ముందుకుసాగడంలేదు. కొన్ని డిపార్ట్మెంట్లను కాంట్రాక్ట్వారితో నడిపిస్తున్నారు. దీని ప్రభావం రీసెర్చ్‌పై పడుతున్నది. ఈ నేపథ్యంలో సీఎస్సార్ తరహాలో రాష్ట్రంలోని వర్సిటీల్లో ఏఎస్సార్ను అమలుచేసే యోచన చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. దీనిపై విస్తృతంగా చర్చలు జరిపి కసరత్తు చేసి అమలుచేస్తామని పేర్కొన్నారు.