కథలాపూర్, ఫిబ్రవరి 24: పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, లోకబాపురెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకున్నదని దుయ్యబట్టారు.
అప్పు డు ఎడాపెడా హామీలిచ్చి ఇప్పుడు గ్యారెంటీలను అమలు చేసేందుకు కిందామీద పడుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు పగుళ్లు వచ్చాయనే కారణంతో ఈ యాసంగిలో గోదావరి నీళ్లను ఇతర ప్రాజెక్టులోకి ఎత్తిపోయకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారని, అయినా వేసిన పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.