KTR | సింగరేణి గనుల వేలం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. రేవంత్ రెడ్డి 2021లో పీసీసీ ప్రెసిడెంట్‌గా, ఎంపీగా ఉన్నప్పుడు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బొగ్గు బ్లాకులను సింగరేణి కాలరీస్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో పెద్ద ఎత్తున వ్యతిరేకించిన మీరు, కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరుత్సాహపరిచేలా వేలంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రిని ఎందుకు పంపించారని నిలదీశారు. ఈ మార్పునకు దారి తీసిన కారణాలను వివరించగలరా? అని ప్రశ్నించారు. తెలంగాణ బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో సింగరేణిని చివరకు ప్రైవేటీకరించేందుకు మార్గం సుగమం అవుతుందని మీరు అంగీకరించలేదా అని అడిగారు. ఎన్డీయే ప్రభుత్వం గుజరాత్, ఒడిశాలోని పీఎస్‌యూలను గనుల ప్రత్యక్ష కేటాయింపులపై మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ పీఎస్యూకి అదే చికిత్స ఎందుకు ఇవ్వడం లేదన్నారు.