హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించే తీరిక ప్రభుత్వానికి లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, ఆక్రమణల నుంచి రక్షణ చర్యలను వివరించేందుకు పదేపదే కాలయాపన చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది.
రెండు వారాల్లోగా ప్రభుత్వశాఖలు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయనిపక్షంలో రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత పిటిషనర్లు రిప్లయ్ కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. ఇరుపక్షాలు రాతపూర్వకంగా వాదనలు వినిపించాలని ఉత్తర్వుల్లో పేరొంది. రాయర్గంలోని మలం చెరువు, కూకట్పల్లి హైదర్‌గూడలోని కింది కుంట, సంగారెడ్డిలోని అమీన్పూర్ చెరువు, ఉప్పల్ రామంతాపూర్‌లోని చిన్నచెరువు, ఇతర చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, చెరువుల రక్షణకు చర్యలు లేకపోవడంతో వ్యర్థపదార్థాలను వాటిలో వేస్తున్నారని, నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని, చెరువుల సుందరీకరణ పేరుతో ప్రైవేట్ స్థలాలు తీసుకోవడం వంటి పిటిషన్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
కౌంటర్లు దాఖలుకు రెండు వారాలకు వాయిదా వేయాలని, మలంచెరువుపై గతంలో ఓ కేసులోని కౌంటర్లోని అంశాలు ఈ కేసుకూ వర్తిస్తాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం.. ప్రభుత్వం మళ్లీ గడువు కోరడంపై మండిపడింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.