Local Body Elections | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో.. ఆగస్టులో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నదన్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సి ఉన్నదని, కుల గణన జరగాలని, బీసీ కమిషన్ నివేదిక రావాలని, ఇవన్నీ కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదురుకాకపోయినా వచ్చే ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 2019లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన సమయంలో సుప్రీంకోర్టు షరతులు విధించింది.
బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేయడానికి నియమించిన కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ద్వారా నివేదిక ఇవ్వాలి. ఆ తరువాతనే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంగా సూచించింది. కానీ బీసీ కమిషన్ ఇంతవరకు కూడా ట్రిపుల్ టెస్ట్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
ఇటీవలే బీహర్‌లో కులగణన చేసి రిజర్వేషన్లను 65 శాతానికి పెంచారు. రిజర్వేషన్లు రాజ్యాంగం నిర్దేశించిన 50శాతం కన్నా అధికంగా ఉన్నాయంటూ ఈ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో తెలంగాణలో కూడా కులగణన చేసినా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు కలిపి 25 శాతం రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో బీసీలకు మరో 25 శాతం తప్ప అంతకన్నా ఎక్కువగా ఇవ్వడానికి వీలులేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం కులగణనను పక్కకు పెట్టినట్టుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా 42 శాతం రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేయనున్నదనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జనగణన చేయడంలేదు. కేంద్ర బడ్జెట్లో ఇందుకు నిధులు కేటాయించకపోవడమే నిదర్శనం.
బీసీ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇచ్చే నివేదికపై అభ్యంతరాలు, వివాదాలు తలెత్తవచ్చని, వాటిపై ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో స్థానిక సంస్థల ప్రక్రియపై కోర్టుకు వెళ్లిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. ఈ అడ్డంకులన్నీ అధిగమించడానికి ఎంత సమయమైనా పట్టవచ్చని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు లోక్‌సభలో వినియోగించిన ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో మొదట గ్రామ పంచాయతీ ప్రాతిపదికన ఓటరు జాబితాను ఖరారు చేస్తారు. దీనికి ప్రామాణికంగా లోక్‌సభ ఎన్నికల ఓటరు జాబితాను తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తిమేరకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ఓటరు జాబితాను ఇచ్చేందుకు అంగీకరించింది. అది వచ్చిన తరువాత పంచాయతీల వారీగా ఓటరు జాబితాను ఖరారు చేస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమయంలో జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలంటూ ప్రకటించారు. జూన్, జూలై నెలలు ముగియనున్నాయి. కానీ ఇంతవరకు ఎన్నికలకు ముందుడుగు పడలేదు. తాజాగా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీని వెనుక రాజకీయ లబ్ధి, ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకే ముఖ్యమంత్రి అధికారులను తొందరపెడుతున్నారని పరిశీలకులు చెప్తున్నారు.