హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి నీటినిల్వ ప్రారంభించేందుకు కేంద్రం, ఏపీ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుతో ఏర్పడే ముంపుపై సర్వే నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కమిటీల పేరిట మూడేండ్లుగా కాలయాపన చేస్తున్నాయి. తాజాగా మరోసారి మరో కమిటీ వేస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం గమనార్హం. దీనికి బాధ్యత వహించాల్సిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపుతోపాటు, పలు ఇతర సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దీంతో అన్ని రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అన్ని రాష్ర్టాలతో ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహేతుకమైన అధ్యయనాలు, గణాంకాలతో బలమైన వాదనలు వినిపించింది. అనేక డిమాండ్లను కేంద్రం ముందు పెట్టింది. 150 అడుగుల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) వద్ద పోలవరంలో నీరు నిలిచినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 891 ఎకరాలు నీట మునగడంతోపాటు స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని స్పష్టం చేసింది.
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెకుల వరదకు సంబంధించి సీడబ్ల్యూసీ పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్ స్టడీ చేయించినప్పుడు డ్యామ్ డిశ్చార్జి స్థాయిని 140 అడుగుల (42.67 మీటర్ల) నుంచి 135.05 అడుగులు (41.15 మీటర్లు)గా నిర్ధారించారనీ, ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెకులకు డిజైన్ చేయడంతోపాటు వరద డిశ్చార్జి స్థాయిని 148.5 అడుగులు (45.26 మీటర్లు)గా నిర్ధారించడంతో అప్ స్ట్రీమ్‌లో ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతోపాటు ముంపు పెరుగుతుందని వివరించింది. వరద, బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల ఎంతమేరకు నీటమునిగిందో సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకోలేదని, దిగువ గోదావరి బేసిన్లో వరుసగా వరదలు సహజమని, ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద మట్టం మరింత పెరుగుతుందని, 2022 వరదలే అందుకు నిదర్శనమని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు ఏపీ, సీడబ్ల్యూసీ నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలు తెలంగాణలో ప్రభావితమయ్యే ప్రాంతం, తగిన రక్షణ కట్టలను ప్రస్తావించలేదని, నిబంధనల మేరకు ప్రాజెక్ట్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మళ్లీ కొత్తగా ఉమ్మడి సర్వే నిర్వహించాలంటే తప్పకుండా పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నది. బ్యాక్‌వాటర్ ప్రభావంతో నదీ తీరాలు, స్థానిక వాగులు, పెద్దవాగు, ఈదుళ్లవాగు, పాములేరు వాగు, తురుబాకవాగుతోపాటు మొత్తంగా 31 ఇతర ప్రధాన, మధ్యస్థ వాగుల వెంబడి డ్రైనేజీ రద్దీ సమస్య కూడా తీవ్రంగా ఉంటుందని, తద్వారా ప్రధాన నది వరదల ప్రభావం 60 గ్రామాలపై ఉంటుందని, మొత్తంగా 40,446 ఎకరాల విస్తీర్ణం నీటమునగడంతోపాటు, 28,000 మంది నిరాశ్రయులవుతారని వివరించింది.
దుమ్ముగూడెం వద్ద నీటి మట్టం 206.23 అడుగులు (+62.86మీ) ఉంటుందని, దాని వల్ల పలు గ్రామాలతోపాటు మణుగూరులోని భారజల ప్లాంట్‌కు, అమ్మగారిపల్లి, ఆమేడ, చింత్రియాలకు ముంపు పొంచి ఉన్నదని సీడబ్ల్యూసీ అధ్యయనం వెల్లడించింది. 2022 జూలైలో కేవలం 24.22 లక్షల క్యూసెక్కుల వరదకే గోదావరి 71.3 మీటర్ల మేర ప్రవహించిందని, అది గతంలో వచ్చిన వరద కంటే తక్కువే అయినప్పటికీ తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిందని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ వద్ద +127.2 అడుగులు (+38.76మీ) నీటి నిల్వ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన అపారమైన ఇన్‌ఫ్లోలు గోదావరిలో కలువలేకపోవడంతో ముంపు పెరిగిందని స్పష్టం చేసింది.
ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-6 ప్రకారం ప్రాజెక్ట్ ప్రతిపాదించినవారే అన్ని రక్షణ చర్యలను చేపట్టాలని, కాలానుగుణంగా ధ్రవీకరించిన నది క్రాస్-సెక్షన్, వార్షిక గరిష్ఠ వరద స్థాయిల వివరాలను, వరదల గణాంకాలను అందజేయాలని కేసీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ వాదనలతో కేంద్రం ఏకీభవించింది. గోదావరి నదికి ఇరువైపులా అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్‌చేస్తూ జాయింట్ సర్వే చేయిస్తామని 2022లోనే హామీ ఇచ్చింది. ఆ మేరకు వెంటనే జాయింట్ సర్వే చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి, ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తామని పీపీఏ, ఏపీ హామీ ఇచ్చాయి.
కానీ, 4 ఏండ్లు గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు వేసింది లేదు. పైపెచ్చు ఓ దశలో సర్వే చేసేది లేదని మాటమార్చాయి. దీంతో మళ్లీ జోక్యం చేసుకున్న సీడబ్ల్యూసీ.. ఉమ్మడి సర్వే పూర్తికి కాలపరిమితిని విధిస్తూ పీపీఏకి అల్టిమేటం జారీ చేసింది. ఏపీ సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణతో కలిసి సర్వే నిర్వహించాలని, ఆ బాధ్యత పీపీఏదేనని తేల్చిచెప్పింది. కానీ, పీపీఏ మాత్రం తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదదంటూ కొర్రీలు పెట్టి అధ్యయనాన్ని అటకెక్కించింది. సర్వే చేస్తే జాతీయ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని ఏపీ, పీపీఏ వితండ వాదానికి తెరలేపాయి.
ఇటీవల జరిగిన పీపీఏ సమావేశంలోనూ ముంపు సర్వేపై మరోసారి చర్చ కొనసాగింది. కానీ, ఆ సర్వే కోసం మరోసారి కమిటీ వేస్తామంటూ పీపీఏ మాట దాటేసింది. ఫేజ్-1 అంటే 41.15 మీటర్ల వరకు పనులను పూర్తిచేసి నీటిని నింపినా భద్రాచలం గుండా ప్రవహించే ఏటపాక అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ (సిల్ లెవల్ +40.250) మునిగిపోతుందని, గోదావరి నదిలోకి నిరంతరం పంపింగ్ అవసరమని తెలంగాణ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఏపీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పీపీఏ చెప్పింది. సర్వే చేస్తామని 4 ఏండ్లు గడచినా పట్టించుకోని పీపీఏ ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. కేంద్రానికి లేఖలు రాయడం, మీటింగుల్లో గత వాదనలనే వినిపించి చేతులు దులుపుకుపోవడమే తప్ప రేవంత్‌రెడ్డి సర్కారు ఏమీ చేయడం లేదని తెలంగాణ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.