నల్లగొండ ప్రతినిధి, మే 1 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణానదీ జలాల్లో రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చకముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ కుట్రలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో.. లేదో వెంటనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి వదిలేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాజెక్టు నిర్వహణ అధికారం కోల్పోయినైట్టెంది. కృష్ణాజలాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ సాగర్ ఆయకట్టు ప్రయోజనాలను సంరక్షించేందుకు పార్లమెంట్లో గళమెత్తుతా’ అని బీఆర్ఎస్ నల్లగొండ లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ గడ్డపై ఈసారి గులాబీ జెండా ఎగురవేస్తా అంటున్న కంచర్ల కృష్ణారెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం మెజార్టీ భాగం వ్యవసాయ ఆధారితమే. గోదావరి, కృష్ణాజలాలపై ఆధారపడే సాగు చేస్తుంటారు. సమైక్య రాష్ట్రంలో సాగర్ ప్రాజెక్టును గాలికొదిలేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మన నీళ్లను మనం వాడుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో 18 పంటలకు సమృద్ధిగా సాగర్ నీళ్లు పారినయ్. కాంగ్రెస్ వచ్చింది.. నీళ్లు పోయినయ్. యాసంగికి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా మనసు రాలే. కేఆర్ఎంబీ పేరు చెప్పి తప్పించుకున్నరు. మొత్తం 3లక్షల ఎకరాల్లో పండలెండినయ్. రైతులు కన్నీళ్లు పెట్టుకున్నరు. అందుకే కృష్ణాజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి వాటా తేల్చాలి. సాగర్ ప్రాజెక్టుపై రాష్ర్టానికే హక్కులు ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలువాలి.
పార్టీపై నాకు ఉన్న నిబద్ధత, నాయకత్వంపై ఉన్న విధేయతతోనే టికెట్ వచ్చిందని భావిస్తున్న. ఎన్నికల్లో పోటీ తొలిసారే అయినా పలు ఎన్నికల్లో ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నం. పార్టీ ముఖ్యుల నుంచి కార్యకర్తల వరకు అందరి సహకారం ఉన్నది. ప్రజల్లో మంచి స్పందన వస్తున్నది.
మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌షోల్లో కేసీఆర్ పాల్గొన్నారు. రెండు చోట్లా కేసీఆర్ కోసం వేలాది మంది తరలివచ్చారు. 1956 నుంచి నేటి వరకు సాగర్ ఆయకట్టుకు, మనకు కాం గ్రెస్సే శత్రువు అన్న కేసీఆర్ మాట ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. సూర్యాపేటలో కాళేశ్వరం ఫలాలు చెప్పడం ఆకట్టుకున్నది. కేసీఆర్ ప్రసంగంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజలు పునరాలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ర్టానికి మేలు జరుగాలంటే బీఆర్ఎస్ గెలవాలి.. నిలవాలని మేము చెప్తున్నం. కాంగ్రెస్, బీజేపీ పాలనను ప్రజలు చూశారు. రాష్ర్టానికి చేసిందేమిటో చెప్పే పరిస్థితి లేదు. మోదీ సర్కా ర్ ఒక్క జాతీయ ప్రాజెక్టునూ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం హక్కుల కోసం కొట్లాడిన తీరు ప్రజల కండ్ల ముందుంది. రాష్ట్ర ప్ర యోజనాలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలించారు. అందుకే ఎన్నో రంగాల్లో రాష్ట్రం టాప్‌గా నిలిచింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపిస్తే రాష్ట్రం కోసం కొట్లాడే సత్తా కేసీఆర్‌కే ఉందని ప్రజలకు చెప్తున్నం.
140 రోజుల కాంగ్రెస్ పాలన చూశారు. ఆరు గ్యారెంటీలు, 13 పథకాలు, 420హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9నే ఎన్నో పథకాలకు డెడ్‌లైన్‌గా చెప్పారు. కానీ ఫ్రీ బస్సు.. నో బస్సు పథకం తప్ప మిగిలిన పథకాలేవీ ఆచరణకు రాలే. ఇప్పుడేమో ఓట్ల కోసం దేవుళ్లపై ఒట్లు వేస్తున్నరు. అందుకే ప్రజలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ మోసాలపై కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అనిపిస్తున్నది. ఈ ఎన్నికలు కచ్చితంగా రెఫరెండమే.
నేను పేదింటి రైతుబిడ్డను. సొంతూరిలో ప్రజల మధ్యనే పెరిగాను. ప్రజల అవసరాలు, రైతుల ఆకాంక్షలు, యువత ఆశలు.. అన్ని వర్గాలను దగ్గరగా చూసిన. 35 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న. పట్టుదలతో పనిచేసే నిబద్ధత ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఉన్న అర్హతలేంటో ప్రజలు ఆలోచించాలి. తండ్రి జానారెడ్డి వారసత్వమే కాంగ్రెస్ అభ్యర్థి ఏకైక బలం. పదవి వ్యామోహం తప్ప.. ప్రజా సమస్యలపై అవగాహన ఎక్కడిది? తమ్ముడు ఎమ్మెల్యే అయిండు.. నేను ఎంపీ కావాలన్నదే ఆలోచన. ఇక బీజేపీకి అభ్యర్థి దొరకక బీఆర్ఎస్ నుంచి చేర్చుకుని టికెట్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ల ప్రభావం నామమాత్రమే.
స్థానికంగా ఉంటూ నల్లగొండ లోక్‌సభ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. విద్య, వైద్య రంగాల్లో మరిన్ని సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతా. కృష్ణాజలాల్లో నీటి వాటా కోసం కొట్లాడుతా. సాగర్ ఆయకట్టు ప్రయోజనాలను కాపాడుతా. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం పనిచేస్తా. వరి, పత్తి పంటలకు మద్దతు ధర కోసం కొట్లాడుతా. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా. నల్లగొండ – దేవరకొండ రహదారి విస్తరణ పనులు, బీబీనగర్ – నడికుడి రైల్వే డబ్లింగ్ పనులు, కొత్త రైల్వేలైన్ కోసం ప్రయత్నిస్తా. రాష్ట్ర హక్కుల కోసం తోటి ఎంపీలతో కలిసి పోరాడుతాను.