B Vinod Kumar | ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులు ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. విద్యాహక్కు చట్టం కింద శిక్షణ ఉపాధ్యాయులు ఉండాలన్నారు. చాలా స్కూల్స్‌లో శిక్షణ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఉన్నవారందరినీ మునగ చెట్టు ఎక్కిస్తారంటూ సెటైర్లు వేశారు.
పోటీ ప్రపంచంలో చాలామంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ సైతం తన మనవలు, మనువరాళ్లను ప్రైవేటు స్కూల్స్‌కే పంపే పరిస్థితి ఉంటుందన్నారు. తాను ప్రభుత్వ, ప్రైవేటు టీచర్స్‌ను వేరుగా చూడడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మెప్పు కోసం ప్రైవేటురంగం ఉపాధ్యాయులను కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు చేశానన్నారు. ప్రభుత్వ మెప్పు కోసం ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులే కాకుండా.. కేజీ టూ పీజీ వరకు అన్ని విద్యాసంస్థల్లో పని చేసే బోధన, బోధనేతర సిబ్బంది కోసం ఓ చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. 2009 ఆగస్టులో విద్యాహక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.
రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారిందని పేర్కొన్నారు. ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి మొత్తం 50లక్షల మంది విద్యార్థులు ఉంటే.. అందులో ప్రైవేటులోనే 51శాతం ఉన్నారన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుబడులకు వెళ్లారన్న ఆయన.. ఈ విషయంలో సీఎం దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలోనే లక్ష మంది ప్రైవేట్ ఉపాధ్యాయులతో సభ పెట్టి సంరక్షణ చట్టం కోసం బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో మాజీ స్పీకర్ జీ నారాయణరావు చొరవతో న్యాయవాదులకు సంక్షేమ చట్టం వచ్చిందని తెలిపారు. అది అన్ని రాష్ట్రాల్లో అమలవుతోందన్న ఆయన.. ప్రైవేటు ఉపాధ్యాయులకు సైతం సంరక్షణ చట్టం రావాల్సిందేన్నారు.