8 నెలల్లో రాష్ట్రమంతా ఆగమాగం. రోడ్డెక్కని వర్గంలేదు. నిరసన తెలియజేయని సమూహంలేదు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టని మేధావివర్గం లేదు. అయితే, వీరందరికీ ఒకే ఒక్క సమాధానం. పోలీసులతో అన్నివర్గాల అణచివేత. ప్రశ్నించే గొంతుకలపై పోలీసుల ఉక్కుపాదం. ఎక్కడికక్కడ అరెస్టులతో దమనకాండ. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనా..? పోలీసు రాజ్యమా..?
ప్రశాంత తెలంగాణ నిర్బంధ తెలంగాణగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజాపాలన పోలీసు రాజ్యంగా పరిణమించడానికి 8 నెలలు కూడా పట్టలేదు. పొట్టకూటి కోసం ఆటో నడుపుకొనే ఆటోడ్రైవర్లు, బడిపిల్లలకు ముద్ద పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు, అన్నింటా తామున్నామని ఆపన్నహస్తం అందించే ఆశవర్కర్లు, ఇంటింటా వెలుగులు నింపే విద్యుత్తు కార్మికులు, భావిభారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లు, పాలనను పదిలంచేసే సర్పంచులు, పట్నాన్ని అద్దంలా ఉంచే జీహెచ్ఎంసీ కార్మికులు, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించే జర్నలిస్టులు, బీఆర్ఎస్ నాయకులు, ఇంకా భాషా పండితులు, డీఎస్సీ అభ్యర్థులు, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగార్థులు, పంచాయతీ కార్మికులు, సీఆర్పీలు.. ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్ సర్కారుపాలనలో పోలీసుల అణచివేతకు గురవ్వని వర్గంలేదు. పోలీసుల కాఠిన్యం రుచిచూడని వ్యక్తిలేడు.
ఒక్కొక్కవర్గం అనేక చోట్ల తమ డిమాండ్ల కోసం పోరాటం చేసింది. అయినా ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. రోడ్డెక్కితే అరెస్టులు. రోడ్డెక్కుతారని అనుమానం వచ్చినా.. ఇండ్లల్లోకి చొరబడి మరీ గృహనిర్బంధం. ఆఖరికి సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా ముందస్తు అరెస్టులు.. ఎక్కడికక్కడ 144 సెక్షన్లు.. ఇది ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాదు పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల్ల, జగిత్యాల, వరంగల్ తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి!
Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ (స్పెషల్ టాస్క్ బ్యూరో), ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): 8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి ఠాణాలకు తరలించడం మరోవంతు. డీఎస్సీ అభ్యర్థుల్లో మహిళలు అని కూడా చూడకుండా ఓయూ క్యాంపస్‌లో పరిగెత్తించి మరీ అరెస్టు చేయడం, ఓయూ యువకుడిపై పిడిగుద్దులు, వ్యవసాయ వర్సిటీ విద్యార్థిని జుట్టు పట్టుకొని లాగిన హృదయ విదారక దృశ్యాలు తెలంగాణ సమాజం కండ్ల ముందు కదలాడుతూ ఉన్నాయి. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలను వాయిదా వేయాలని, మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళనలపై పోలీసులు అణచివేత చర్యలకు దిగారు. రోడ్డు మీద కనిపించినవారిని కనిపించినట్టు ఈడ్చుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు.
రైతులు, జర్నలిస్టులు అని కూడా చూడకుండా ఠాణాలకు తరలించారు. కోఠిలో ఆశావర్కర్ల ఆందోళనలను అడ్డుకొన్నారు. తమ సమస్యలపై సీఎంను కలిసి గోడు చెప్పుకొంటామన్న గురుకుల అభ్యర్థుల అభ్యర్థనను అణిచివేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల గొంతు నొక్కే చర్యలకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులపై కర్కశత్వం ప్రదర్శించారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీకి వెళ్లి విజ్ఞప్తి చేయాలనుకొన్న పెద్దపల్లి ఆటోడ్రైవర్లను కమాన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డిమాండ్ల సాధన కోసం ధర్నాకు బయల్దేరిన పంచాయతీ కార్మికులను ధర్మారం మండల కేంద్రంలో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సీఆర్పీలను అర్ధరాత్రి అనిచూడకుండా మంథని పోలీసులు అరెస్ట్ చేశారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ల ముట్టడికి వెళుతున్న సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేశారు. బొగ్గు గని బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని చలో హైదరాబాద్ చేపట్టిన కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు. జీపీ కార్మికులు, ఆశాకార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ చేపట్టగా, కార్మికులు, వామపక్ష సంఘాల నాయకులను అరెస్టు చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 31న చలో అసెంబ్లీ చేపట్టగా 30న రాత్రికి రాత్రే మిడ్ డే మీల్స్ కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీజేవైఎం చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని, మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన నిరుద్యోగుల ధర్నాను అడ్డుకొని 70 మందిని వాళ్ల ఇండ్లల్లోనే అరెస్టు చేశారు. చలో హైదరాబాద్ చేపట్టిన 40 మంది ఆశా కార్యకర్తలను, 60 మంది మధ్యాహ్న భోజన నిర్వహకులను వారి ఇండ్లవద్దే అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. జగిత్యాలలోని నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిరసనకు పిలుపునిచ్చిన సీపీఎం నాయకులను అరెస్టుచేశారు. వరంగల్‌కు సీఎం సహా మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు ముందస్తుగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించారు.
సీఎం పర్యటన ముగిసే వరకు పోలీసు స్టేషన్లలోనే ఉంచారు. దళితబంధు కోసం దళిత నేతలు కామారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించాలనుకొంటే ఉక్కుపాదం మోపారు. పాలబిల్లుల కోసం రోడ్డెక్కిన కోటగిరి పాడిరైతుల నిరసనలను అడ్డుకొన్నారు. వడ్లు కొనాలంటూ కామారెడ్డి మార్కెట్లో ఆందోళనలు చేసిన రైతులపై, వరికి బోనస్ ఇవ్వాలన్న బీఆర్ఎస్ నేతల నిరసనలపై ఉక్కుపాదం మోపి అరెస్టులు చేశారు. ఇవి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న పోలీసు రాజ్యానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ నిర్బంధకాండను చెప్తూపోతే ఆ జాబితాకు అంతు ఉండదు.