Taj Mahal : కేంద్ర ప్రభుత్వం (Union Govt) తాజ్మహల్ (Taj Mahal) పేరును మార్చబోతున్నదంటూ మీడియాలో వస్తున్న వార్తలు ఉత్త పుకార్లేనని తేలిపోయింది. దీనిపై గురువారం రాజ్యసభ (Rajya Sabha) లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి (Minister of Culture) గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) స్పష్టతనిచ్చారు. తాజ్మహల్ పేరు మార్పునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని వెల్లడించారు.
‘మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తాజ్మహల్ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉందా..?’ అని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టస్ అడిగిన ప్రశ్నకు మంత్రి షెకావత్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాల కోసం యూపీఏ సర్కారు 10 ఏళ్లలో చేసిన ఖర్చుకంటే.. ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన ఖర్చు రెట్టింపు ఉన్నదని చెప్పారు.
‘పశ్చిమబెంగాల్లోని మరిన్ని చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరిపించే యోచన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా..?’ అన్న టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. మానవ వనరుల లభ్యతను బట్టి తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.