హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటలపాటు ఆయన విచారణ కొనసాగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న వారిలో అందరికంటే సంతోష్కుమార్నే ఎక్కువ సమయం సిట్ విచారించింది. ఉదయం తెల్లాపూర్ నుంచి బయలుదేరిన ఆయన మంగళవారం మధ్యాహ్నం నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో అగ్రనేత హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ లీగల్‌సెల్ బృందంతో మాట్లాడి.. సిట్ విచారణకు బయలుదేరారు.
మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పట్నుంచి రాత్రి 11 గంటల వరకూ సిట్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. కాగా, సిట్ అధికారులు సంతోష్‌కుమార్‌ను అడిగిన ప్రశ్నలే మళ్లీమళ్లీ అడిగినట్టు తెలిసింది. అయితే విచారణకు తాను పూర్తి సహకారం అందించినట్టు సంతోష్ తెలిపారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికతో సమాధానం చెప్పినట్టు మీడియాకు వెల్లడించారు. సంతోష్‌కుమార్‌కు సంఘీభావం తెలిపినవారిలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, వాసుదేవారెడ్డి, వై సతీశ్‌రెడ్డి, రాఘవ, కురవ విజయ్ సహా పలువురు ముఖ్యనేతలు ఉన్నారు.

పోలీసులు తమ గౌరవాన్ని కోల్పోవద్దు
కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యంలా, జేబు సంస్థలా సిట్ తయారైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరికాయో సిట్ బయటపెట్టాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆధారాల్లేని వార్తలతో కొన్ని మీడి యా సంస్థలు బీఆర్ఎస్ నేతల మీద బురద జల్లుతున్నాయని, పత్రికా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారి పోలీసులు తమ గౌరవాన్ని కోల్పోవద్దని సూచించారు. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను విచారణకు పిలవడం వేధించడమేనని, వివరాలు తెలుసుకునేందుకు అంటూనే దోషులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
సిట్ పేరుతో కక్ష సాధింపు: శశిధర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ములేక, సిట్పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి విమర్శించారు. కక్షసాధింపులో భాగంగా మొన్న హరీశ్‌రావు, నిన్న కేటీఆర్ తాజాగా సంతోష్‌కుమార్‌ను పిలువడాన్ని మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ పాల్పడుతున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.