కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 19 : అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెల్యూర్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఏడాదిలో ఏం చేశారని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని 37వ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేశారని, అందుకే ప్రజలు విజయోత్సవాలు చేశారని గుర్తు చేశారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, దమ్ముంటే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
ఫార్మా పేరుతో రైతులపై అక్రమ కేసులు పెడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా..? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుకా..? పింఛన్లు పెంచుతామని చెప్పి తప్పినందుకా..? యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా..? తులం బంగారం ఇస్తామని చెప్పి మర్చిపోయినందుకా..? 20 ఏండ్ల కిందట నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నందుకా..? లగచర్లల్లో ప్రజలను అవస్థలు పెడుతున్నందుకా..? ఎందుకు విజయోత్సవ సభలు చేస్తున్నారని నిలదీశారు. యువతను నమ్మించి ఎన్నికల సమయంలో అనేక విధాలుగా ప్రచారం చేయించుకున్నారని, ఇప్పుడు నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయలేదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.