హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మంత్రి శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నాడని, ఆయన ప్రోద్బలంతో కొన్ని మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు వేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ ‘పుట్ట మధు కనబడటం లేదు.. ప్రజలకు ముఖం చాటేస్తున్నారు అంటూ ఓ చానల్లో నాకు వ్యతిరేకంగా ప్రచారమైన కథనాన్ని ఖండిస్తున్నా.. ఒక వేళ టీవీలో కథనాలు నాడపాల్సి వస్తే ఒక మంత్రిగా కొనసాగుతూ మంథని నియోజకవర్గానికి ఏమీ చేయలేదు అన్న కథనాలు వేయాలి’ అని హితవు పలికారు.
వాస్తవంగా మంత్రి శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గానికి గాని, తన సొంత గ్రామానికి గాని చేసిందేమీ లేదని, సొంత ఊరిలో సర్కార్ స్కూల్‌కు బెంచీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో మంత్రి ఉన్నారని దుయ్యబట్టారు. సీబీఐ విచారణకు తాను ఎందుకు జంకుతానని ప్రశ్నించారు. 40 ఏండ్లుగా మంథనిని ఏలుతున్న శ్రీధర్‌బాబు కుటుంబం.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని మండిపడ్డారు. మంథనిలో మహానీయుల విగ్రహాలను తాను పెడితే తప్పేంటని నిలదీశారు. తాను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడినని, రాజకీయాల్లో ఎదుగుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని వాపోయారు. శ్రీధర్‌బాబు పోలీసుల సాయంతో తమ కార్యకర్తలను వేధిస్తున్నాడని చెప్పారు. మంత్రికి చేతనైతే తన సొంత గ్రామంలోని స్కూల్లో పిల్లల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. తాను ఓడినా, గెలిచినా మంథనిలోనే ఉంటున్నానని వివరించారు. మీడియా సంస్థలు తనపై విష ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.