హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు కరప్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ నుంచి జడ్ వరకు 26 కుంభకోణాలు చేశారని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి గురువింద గింజలాంటోడు.. తన కింద నలుపు గుర్తించకుండా దొంగే దొంగా..దొంగా అని అరిచినట్టు.. అక్రమాలకు తెరలేపి గగ్గొలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి రే‘వోంట్’రెడ్డిగా మారాడని ఎద్దేవాచేశారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్.. పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బిల్డర్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకే కోర్టులో పిల్ దాఖలు చేశారని ఆరోపించారు. అవినీతికి చిరునామాగా మారిన ఆ పార్టీ జెండాను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌వి ట్రిపుల్ఆర్ స్కీమ్స్ రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అయితే, కాంగ్రెస్‌వి ట్రిపులార్ స్కాంలు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి కుంభకోణాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఫహీం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న భూములపై కన్నేశాడని, సీఎం అండతో అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో బస్సుల కొనుగోళ్లు, డాక్యుమెంటరీల ఫోర్జరీ, కమీషన్లు, కలెక్షన్లు, ఫార్మా, ఫోర్త్‌సిటీ పేరిట భూదందాలు, హైడ్రా పేరుతో కలెక్షన్లు, జలయజ్ఙం పేరుతో ధనయజ్హం, కర్ణాటక మిల్క్ కో ఆపరేటీవ్ స్కాం, మైనింగ్ మాఫియా, క్వారీల స్కామ్స్.. ఏ టు జడ్ వరకు అనేక స్కాంలు జరిగాయని వివరించారు.
తెలంగాణ జాతిపితపై నిందలా?
చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై రేవంత్ సర్కారు విచారణల పేరిట నిందలేయడం దుర్మార్గమని జీవన్‌రెడ్డి ఆ గ్రహం వ్యక్తంచేశారు. కేసులు వేస్తూ ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్‌కు ఆయన ఉసురు తగులుతుందని విమర్శించారు. ఫార్ములా- ఈ రేస్ తెచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, వాసుదేవారెడ్డి పాల్గొన్నారు.