హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్ట్ సీఎం అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో అత్యంత పనికిమాలిన, తెలివితక్కువ సీఎం రేవంతేనని తీవ్ర విమర్శలు చేశారు. పరీక్షల వాయిదాపై కేటీఆర్, హరీశ్‌రావును ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోమంటున్న రేవంత్ రెడ్డి.. నీట్‌పై రాహుల్‌గాంధీని కూడా దీక్ష చేయుమంటున్నారా? ఆయన కూడా చనిపోవాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
‘తెలంగాణ ప్రజలు దరిద్రం నెత్తిన మీద పెట్టుకున్నాం.. రేవంత్‌రెడ్డి దీక్ష చేస్తే తెలంగాణకు పట్టిన పీడ, శని, దరిద్రం పోతుంది’ అని ప్రజలు కోరుకుంటున్నారంటే బాగుంటుందా? అని అన్నారు. రాహుల్‌గాంధీని కూడా నీట్‌పై దీక్షకు కూర్చోబెట్టాలని సీఎంకు చురక అంటించారు. సీఎంగా ఉండి ఆయన భాష, శాడిజం ఏమిటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థాయికి తగిన భాష, మాటలు మాట్లాడాలని హితవు చెప్పారు.
ఉద్యమ సమయంలోనూ ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడుగు పెట్టలేదని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఓయూలో పోలీసులు దమనకాండను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టెట్ ఫలితాలు రాగానే డీఎస్సీ పెడితే ఏ విధంగా ప్రిపేర్ కావాలని అభ్యర్థులు అడుగుతున్నారని, అందుకే డీఎస్సీని వాయిదా చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. టెట్‌కు, డీఎస్సీకి కనీసం 45 రోజులు గడువు ఉండాలని, ఆ సోయి రేవంత్‌రెడ్డికి లేదని ధ్వజమెత్తారు.
నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్వీ మద్దతుగా నిలిచిందని తెలిపారు. ఇటీవలే 9 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించారని, ఆ 9 వేల పోస్టులను కూడా డీఎస్సీలో కలిపాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే అన్ని ఉద్యోగాలను అమ్ముకున్నారని, తెలంగాణలో వసూలు చేయాలి.. ఢిల్లీకి కప్పం కట్టాలి.. అనేదే రేవంత్ విధానం అని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని, నిరుద్యోగుల కోసం రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకురాలేదా? ప్రశ్నించారు.
కేటీఆర్, హరీశ్‌రావు దీక్ష చేసి చనిపోవాలని అనేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, వారికి దీక్షలు కొత్త కాదని, తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీలో చంద్రబాబు పక్కన ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోవాలని కోరుకునే రేవంత్‌రెడ్డి లాంటి సీఎం దేశంలో మరెవరూ లేరని మండిపడ్డారు. పరీక్షలను వాయిదా వేయాలని గతంలో మాట్లాడిన కోదండరాం ఎకడికి వెళ్లారని, ఎమ్మెల్సీ పదవి కోసం నోరు విప్పడం లేదా? అని ఎద్దేవా చేశారు.
పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు వస్తాయని అంటున్న రేవంత్.. కోచింగ్ సెంటర్ నడిపిన రియాజ్‌కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు? ఆయన ఎంత సంపాదించుకున్నారు? అని నిలదీశారు. గ్రూప్ – 1కు 1:100 నిష్పత్తిలో పిలవాలని అసెంబ్లీలో భట్టి మాట్లాడలేదా? భట్టి, రేవంత్ ముకు నేలకు రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు, ఈ మధ్య పచ్చ నేతతో కలిసిన తర్వాత రేవంత్ పచ్చకామెర్లు ముదిరాయని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, మంద సురేశ్, కడారి స్వామియాదవ్, పడాల సతీశ్, జహీర్‌ఖాన్, జంగం అవినాశ్, శ్రీకాంత్‌గౌడ్, యుగేందర్‌రెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు.