ముంబై, జూలై 30: కొత్తగా రుణాలు తీసుకోవాలనుకొనేవారిపట్ల గతంతో పోల్చితే బ్యాంకులు ఇప్పుడు అంతగా ఆసక్తి చూపట్లేదని, పాత కస్టమర్ల వైపే మొగ్గు చూపుతున్నాయని ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్యూనియన్ (టీయూ) సిబిల్ చెప్తున్నది. సిబిల్ తాజా డాటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2025-26) కొత్త రుణగ్రహీతలు అన్ని రుణాల్లో కలిపి 13 శాతంగానే ఉన్నారు. అయితే పదేండ్ల క్రితం (2016-17) ఇది 32 శాతంగా ఉన్నట్టు గురువారం సిబిల్ వెల్లడించింది. చిరు వ్యాపారులకు రుణాల విషయంలోనూ కొత్త రుణగ్రహీతల వాటా 60 శాతం నుంచి 39 శాతానికి పడిపోయినట్టు చెప్పింది. నిజానికి దేశంలో రుణ అర్హత కలిగినవారు 2017 మార్చిలో 79 కోట్లుగా ఉంటే.. 2026 మార్చిలో 89 కోట్లకు పెరిగారని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ స్థాయిలో నూతన రుణగ్రహీతలు పెరుగలేదని చెప్పడం గమనార్హం.
ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్తగా అప్పులు తీసుకోవాలనుకొనేవారికి పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా టీయూ సిబిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ భవేశ్ జైన్ అన్నారు. ఎక్కువమంది ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లోనే రుణాలు పొందుతున్నారని చెప్పారు. అయితే ఎగవేత భయాలు లేదా క్రెడిట్ పాలసీలు కొత్తవారి రుణాల మంజూరులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్న జైన్.. పాత రుణగ్రహీతలతో పోల్చితే కొత్తవారి నుంచి రుణాల వసూళ్లు ఇబ్బందికరంగా మారడమూ ఈ పరిస్థితికి కారణమేనన్నారు.
కరోనాకు ముందు ద్విచక్ర వాహనాల కొనుగోలు కోసం ఎక్కువమంది రుణాలపై ఆధారపడేవారని, ఇప్పుడు ఆ స్థానంలో మొబైల్ ఫోన్ వచ్చిందని జైన్ తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ల కొనుగోలు కోసం తీసుకుంటున్న సగటు రుణం విలువ రూ.35,000పైనేనని, ఎక్కువగా ఎన్బీఎఫ్సీల్లో పొందుతున్నారని చెప్పారు.