సిద్దిపేట, జూలై 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఓపీఎస్ కోసం పోరాడుతున్న సీపీఎస్ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగులు చేస్తున్నది న్యాయమైన పోరాటమని, వారికి ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు గురువారం సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జనచైతన్య యాత్ర పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెకచేయకుండా ఉద్యోగులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక ప్రధాన హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. ఓపీఎస్ అమలు, ఆరు నెలల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏల చెల్లింపు, మెరుగైన ఈహెచ్ఎస్ వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులపై అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ విచారణల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు.
సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ను నెలల తరబడి జమ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ జమ చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఉద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, జిల్లా అధ్యక్షుడు దేవరాజు, ప్రధాన కార్యదర్శి శశికుమార్, రఘురామ, ఉదయశ్రీతోపాటు వివిధ సంఘాల నాయకులు గ్యాదరి పరమేశ్వర్, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.