న్యూఢిల్లీ, జూలై 30: బాబా రామ్దేవ్నకు చెందిన ఎఫ్ఎంసీజీ సంస్థ పతంజలి ఆయుర్వేద గ్రూపు తాజాగా బీమా రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థ..జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు ప్రతిపాదనకు బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఒప్పందం ప్రకారం పతంజలి ఆయుర్వేదకు మాగ్మా ఇన్సూరెన్స్‌లో 73.56 శాతం వాటా దక్కనుండగా, డీఎస్ గ్రూపునకు 24.5 శాతం వాటా దక్కనున్నది. వచ్చే మూడు నెలల్లో పూర్తికానున్న ఈ ఒప్పందం విలువ రూ.4,500 కోట్ల స్థాయిలో ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ మోటార్, హెల్త్, ప్రాపర్టీ, కమర్షియల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయిస్తున్నది.