భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితి, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శుక్రవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, వరదల తీవ్రత గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి, అవసరమైతే సురక్షిత, పునరావాస కేంద్రాలకు తరలించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.40 అడుగులుగా నమోదైందని, ప్రస్తుత నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా, ఆ సమయంలో సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.