హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్‌గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ పోర్టల్ ద్వారా రాత్రికి రాత్రే 4,000 నుంచి 4,500 అం శాలు బాధ్యులకు తెలియకుండానే అప్రూ వ్ అయ్యాయని ఆరోపించారు. భూ భారతిలో దొంగలు ప్రభుత్వ పెద్దలా? అధికారులా..? అదృశ్య శక్తులు ఎవరైనా ఉన్నా రా? అని ప్రశ్నించారు. దీని వెనుక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతోపాటు ఆయన సతీమణి పాత్ర కూడా ఉన్నదని అనుమా నం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నేతలు కురువ విజయ్, పల్లా ప్రవీణ్, పడాల సతీశ్, ధర్మేందర్, కడారి స్వామి, కృష్ణ, మిథున్, కార్తీక్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రే కాదు.. ఆయన కుటుంబీకులు.. ఆయన భార్య కూడా ఐఏఎస్‌లకు ఆదేశాలిస్తున్నరు.. చెప్పిన పనులు చేస్తవా? లేదా? అని భయపెడుతున్నరు. అధికారులు కూడా పోస్టింగ్‌ల కోసం తప్పులు చేస్తున్నరు..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్‌లో వారంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వచ్చిన మొదట్లో అలీబాబా 40 మంది దొంగల ముఠా ఉండేదని, క్రమేణా వారందరూ కనుమరుగై ఇద్దరు భార్యాభర్తలే మిగిలారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
రేవంత్‌కు తెలిసింది రియల్ ఎస్టేటే..
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి రెండున్నరేండ్లు దాటినా పాలనపై అవగాహన రావడంలేదని కిశోర్ విమర్శించారు. ఆయనకు తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ దందానేని దెప్పిపొడిచారు. ‘స్కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూ భారతి అక్రమాలకు అడ్డాగా తయారైంది.. ఎవరికీ సంబంధం లేకుండానే 4,000 నుంచి 4,500 అప్లికేషన్లు అప్రూవ్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో 80 అప్లికేషన్లు అప్రూవ్ అయ్యాయి. సూర్యాపేట, తుంగతుర్తిలోనూ ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి’ అని ఆరోపించారు. ‘రంగారెడ్డి జిల్లాలో సుమారు 87 ఎకరాలకు సంబంధించిన భూముల నాలా కన్వెర్షన్ చేశారు. ఈ వ్యవహారాల వెనుక 122 మంది తహసీల్దార్ల హస్తమున్నదని ఆరోపించారు.
బీజేపీతో పొంగులేటి సంప్రదింపులు!
రెవెన్యూ శాఖలో ఇంతటి అక్రమాలు జరుగుతుంటే స్పందించాల్సిన రెవెన్యూ మంత్రి పొంగులేటి మౌనంగా ఉండటంలోని అంతర్యమేంటని గ్యాదరి కిశోర్ ప్రశ్నించారు. ఇప్పటికే భూముల పేరిట కోట్లు దిగమింగిన ఆయన, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలిసి ఇప్పటినుంచే బీజేపీ నేతలతో సంప్రదింపుల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. డిజిటల్ సిగ్నేచర్ ఉంటే తప్ప భూమార్పిడికి అవకాశం లేకుండా కేసీఆర్ ధరణి చట్టాన్ని తెచ్చారని గుర్తుచేశారు. దానిస్థానంలో తెచ్చిన భూభారతి ఇష్టారాజ్యంగా తయారైందని దుయ్యబట్టారు.