Prashanth Reddy | ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. కేసీఆర్ తొమ్మిదేళ్లలో రైతుబంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో 11 విడుదతల్లో రూ.75వేలకోట్ల జమ చేశారని తెలిపారు. కానీ, ఇనాడు కాంగ్రెస్ తరహాలో హంగామా చేయలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి రూ.7500 కాకుండా రూ.5000 ఇచ్చారని.. రెండో విడుతలో ఎగ్గొట్టారని.. మూడు పంటకు నాలుగు ఎకరాలపై ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఎగవేత, అన్నిరకాల వడ్లకు బోనస్ అని చెప్పి సన్నాలకు అని మాట మార్చినందుకు బోనస్ ఎగ్గొట్టినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్ ఆటకెక్కించినందుకా ? రైతుబీమా ప్రీమియం కట్టనందుకా..? కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇంకా అమలు చేయనందుకా ? రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా రైతు నడ్డి విరుస్తున్నందుకా? అంటూ నిలదీశారు. కేసీఆర్ పరిపాలనలో వ్యవసాయం పండగ అయితే.. రేవంత్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయం దండగ అయినందుకా..? నీ సంవత్సరన్నర పరిపాలనలో 500 మదికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా ? నీ పరిపాలనలో పండించిన ధాన్యం సకాలంలో అమ్ముకోలేక కల్లాల పై పిట్టల్లాగా రైతులు రాలిపోయినందుకా ? ఎందుకు చేసుకోవాలి సంబరాలు రేవంత్ రెడ్డి ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా వేసి సంబరాలు చేస్తున్నావని.. ఇది ఎన్నికల స్టంట్‌గానే రైతులు చూస్తున్నారని.. ఇప్పటికైనా సంబరాల పేరిట ఎన్నికల డ్రామాలు ఆపి రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. ఎగ్గొట్టిన రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరూ రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని.. అన్ని రకాల వడ్లకు పాత సీజన్లతో సహా రూ.500 బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.