హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ప్రజలను మోసగించేందుకు తెలంగాణ లో బీసీలకు ఏదో చేస్తున్నట్టు జీవోల పేరి ట కాంగ్రెస్ నాటకం ఆడుతున్నదని దు య్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ జీవో తెచ్చి ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే జీవోను ఆరు నెలల క్రితమే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీసీ రిజర్వేషన్లపై ఈ మాత్రం జీవో తీసుకరావడం కోసం.. అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎందుకు? బీసీ బిల్లు ను ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్‌కు ఎందుకు పంపినట్టు ? అని నిలదీశారు. జీవోను తెచ్చినట్టే తెచ్చి, తిరిగి కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. ఆ కేసు కోర్టులో ఉన్నప్పటికీ స్థాని క సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తప్పుబట్టారు.
ఈ జీవో చెల్లదనే విషయం దీనిని తీసుకొచ్చిన కాంగ్రె స్ సర్కార్ ఆత్మసాక్షికి తెలియదా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఇదేవిధంగా జీవో తెచ్చి, రిజర్వేషన్లు పెంచి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. సుప్రీంకోర్టు మొత్తం ఆ ఎన్నికల ప్రక్రియనే కొట్టి వేసిందని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితినే మన రాష్ట్రంలో కూడా తీసుకొనిరావాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘ఒకవేళ ఎన్నికల ప్రక్రియను కోర్టు కొట్టివేస్తే.. ఎంతో ఖర్చు పెట్టి, వ్యయ, ప్రయాసలకోర్చి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? బీసీలను ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీ యించాలని చూస్తున్నదా? బీసీలను తెలివిలేనివాళ్లుగా భావిస్తున్నదా?’ అని ప్ర శ్నించారు. సుప్రీంకోర్టులో ఎవరైనా ఏ చిన్న పిటిషన్ వేసినా, మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
మోదీని ఎందుకు కలువలేదు?
బీసీ బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పటికీ, ప్రధాని మోదీని ఎందుకు కలువలేదని, ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్ర లు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు జీవో ఎందుకు జారీ చేయలేదని నిలదీశారు. 9వ షెడ్యూల్ చేర్చితేనే.. బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్ధత వస్తుందని తెలిపారు. 9వ షెడ్యూల్లో చేర్చే అంశం లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సహకరిస్తుందని స్పష్టంచేశారు. బీసీలకు 42% దామాషా ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లో, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ హైకోర్టులో పార్టీల అఫిడవిట్లుకు ఆమోదం దొరికినా.. సుప్రీంకోర్టులో కూడా అలా జరుగుతుందని హామీ ఇస్తారా? అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో చైర్మన్ సంజివోల్ల రాఘవయాదవ్ పాల్గొన్నారు.