BC Reservations | హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ భవన్లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బీసీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున త్వరలోనే బీసీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలవనుందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా కులగణన జరిపి, హడావుడిగా అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును పెట్టిందన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామనడం రాజ్యాంగ విరుద్ధం. 9వ షెడ్యూల్లో చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని అసెంబ్లీలో తాము స్పష్టం చేసినం. అమలు కాదని తెలిసే కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్య పెడుతుందన్నారు.
ఢిల్లీలో ధర్నా చేస్తామనడం కొత్త డ్రామాకు కాంగ్రెస్ కుట్ర. బిజెపి, కాంగ్రెస్ పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాము. మీ చేతుల్లోనే ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీలో 42 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు. మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇచ్చి చిత్తశుద్ది నిరూపించుకోవాలి. వివిధ ప్రభుత్వ శాఖలలో కూడా బీసీలను అణచివేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.