హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి చెకులు పాతవే ఇస్తున్నారని, ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని 420 హామీలను అమలు చేస్తరా చెయ్యరా? అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే మొదట సంతోషపడేది తామేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను గుంజుకుంటుందని కాంగ్రెస్ విషప్రచారం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ సాధనలో, అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణంలో తామంతా కేసీఆర్ వెంట సైనికుల్లా పనిచేశామని చెప్పారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని వెల్లడించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, ఆ దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూపొందిస్తున్నారని వెల్లడించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్నదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో 2009, 2014, 2019లో వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించినట్టే రానున్న ఎన్నికల్లోనూ చరిత్ర సృష్టిస్తామని వెల్లడించారు. 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని గుర్తుచేశారు.
పార్లమెంటులో తెలంగాణ తరఫున బలమైన గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలనే ఆలోచన ప్రజల్లో ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని అనేక హామీలను అమలు చేశారని వివరించారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కాదనే విషయం ప్రజల అనుభవంలో ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తామంతా నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు తమ అధినేత కేసీఆర్ అన్నీ ఆలోచించి అభ్యర్థులను ప్రకటిస్తారని, అంతిమంగా పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా తామంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, రామ్మోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.