హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం బీసీ జనాభాయే ఎందుకు తగ్గిందని మాజీ మంత్రి, దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గినట్టు ఎందుకు చూపారని నిలదీశారు. బీసీలను అవమానించడానికే హడావుడిగా అసెంబ్లీ మీటింగ్ పెట్టారా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ సమావేశంలో, అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కోరుకంటి చందర్, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు తరహాలో న్యాయపరమైన చిక్కులు లేకుండా సర్వే చేపట్టారా? అని ప్రశ్నించారు. కులసంఘాల నేతలు, ఎంతోమంది మేధావులు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వినడంలేదని నిలదీశారు. రాష్ట్రంలో బీసీ జనాభాను తగ్గించి చూపడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను, ముస్లింలను కలపడం వెనుక కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటువైపు?: దాస్యం
కాంగ్రెస్‌లోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీ వైపా? బీసీ ప్రజల వైపో తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీనే ఆ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తగులబెట్టాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలాంటి తప్పుడు సర్వేను మిగతా పార్టీలు ఎలా నమ్ముతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెప్తూ బీసీ జనాభాను తక్కువగా చూపిస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ చర్చను బీసీ కుటుంబాలు ఎంతో ఆసక్తిగా చూశాయని, కానీ, బీసీలు రాష్ట్రంలో 42 శాతమే ఉన్నట్టు సర్వే లెక్కల్లో చూపడంపై భగ్గుమంటున్నారని చెప్పారు.
పొంతన లేని లెక్కలు: అంజయ్యయాదవ్
ఓటర్ల సంఖ్యకు, తెలంగాణ జనాభా లెక్కలకు, కులగణన సర్వేకు ఎక్కడా పొంతన కుదరడం లేదని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విమర్శించారు. కులగణన అంటే రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ, కులాలవారీగా జనాభాను మాత్రం సక్రమంగా సర్కారు వెల్లడించడం లేదని విమర్శించారు. బీసీలను మోసగించడం తప్ప కాంగ్రెస్ సర్కారుకు బీసీల పట్ల ప్రేమ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలను నిలదీయాలి: చందర్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలను ఎకడికకడ బీసీలు నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీహార్, కర్ణాటకలో మోసం చేసినట్టుగా తెలంగాణలో కూడా బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం చేయించిన సర్వేలెకలు తప్పల తడక అని, తమ జనాభాను తక్కువ చేసి చూపించడం పట్ల బీసీలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బీసీలు 50 శాతానికి పైగానే ఉండాలని, కానీ, 46 శాతానికి పరిమితం చేయడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు.
రాజ్యంగబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలి: జైపాల్‌యాదవ్
బీసీలకు స్థానిక సంస్థల్లో రాజ్యంగబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీపరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనడం రాజ్యాంగబద్ధం కాదని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఉండేందుకే బీసీ జనాభాను తకువ చేసి చూపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి బీసీలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి అనుభవం, అవగాహన లేదని విమర్శించారు.
రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తాం
తాజా కులగణన ప్రకారం బీసీలు 1.85 కోట్ల మంది ఉంటే.. దామాషా ప్రకారం 51 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కానీ ఇటీవలి సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46 శాతమే ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. ఇది కచ్చితంగా మోసమే. 2014 నాటి సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతంగా ఉన్న బీసీలు తాజా సర్వే నాటికి ఇంత భారీగా ఎలా తగ్గుతారు? కొత్త ఫార్మాట్లో బీసీ కులగణన చేపట్టాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి. లేదంటే ఉద్యమిస్తాం.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధిచెప్పాలి
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కు టుంబ సర్వేలో 52 శాతంగా ఉన్న బీసీ జనాభా ప్రస్తుత కు ల గణనలో 46.25 శాతంగా చూపడంలో పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఇది బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక ఫలాలు అందకుండా చేయడమే. రాష్ట్రంలోని బీసీల జనాభా శాతాన్ని తగ్గించి చూపారు. బీసీలంతా ఏకతాటిపై నడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.
– కొలిపాక శ్రీనివాస్, పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్‌లీడర్