Srinivas Goud | హైదరాబాద్ : తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి, వలస కూలీలుగా వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు డబ్బులు చెల్లించేవాళ్లం. కాంగ్రెస్ హయాంలో నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. మరో నాలుగు నెలలు గడిచినా డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇవ్వకపోతే పాడి రైతు ఎలా బతుకుతాడు..? దాణా ఎక్కడ్నుంచి తెస్తాడు..? పాల ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది.? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.
రాష్ట్రంలో పాలకు బాగా డిమాండ్ ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే 30 లక్షల లీటర్లు అవసరం. 5 లక్షల లీటర్లు కూడా సేకరించలేకపోతున్నారు. ఈ 5 లక్షల లీటర్లలో 50 శాతం కేవలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచే వస్తున్నాయి. మిగతా 25 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డైయిరీని మూసేయాలని కుట్ర జరగుతోంది. ఏపీ డెయిరీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. గుంటూరు, విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. అవి కల్తీవో.. మంచివో తెలియని పరిస్థితి ఉంది. యూరియాతో పాలు తయారు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
కల్తీ పాలతో క్యాన్సర్ వస్తుందని డాక్టర్లే చెబుతున్నారు. కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్‌లో తాగిస్తున్నారు. దీంతో ప్రాణాలు పోతాయి. విషపూరితమైన పాలు తాపేందుకు ఇతర డెయిరీలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ డెయిరీని బొందపెట్టి ఆంధ్రా డెయిరీని పైకి లేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్లే తెలంగాణ డెయిరీకి ప్రోత్సహకాలు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డెయిరీని కాపాడుకున్నాం. సకాలంలో దాణా ఇచ్చాం. సబ్సిడీ మీద బర్రెలు, ఆవులను ఇచ్చారం. ఇప్పుడు సబ్సిడీ, దాణా పోయింది. పాలు పోసిన రైతులకు పైసలు ఇవ్వట్లేదు. నెయ్యిని మురగబెడుతున్నారు. యాదాద్రికి, తిరుపతికి, వేములవాడకు ఇవ్వొచ్చు కదా.. ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తోంది అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొన్నందుకు సంతోషం: కేటీఆర్
Harish Rao | సమస్యల వలయంలో గురుకులాలు.. చీమకుట్టినట్లైనా లేని ప్రభుత్వం: హరీశ్‌రావు