Srinivas Goud | హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అంటే పోలీసులతో అరెస్టులు చేయించడమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలి. కేసీఆర్ హయాంలో లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది.. అబద్దాలు చెబుతూ కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఆపాలి అని డిమాండ్ చేశారు.
బీసీలకు ఇవ్వని హామీలు మేము నెరవేర్చాము. మేము ప్రజా ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాల నుంచి వచ్చాము. సిద్దరామయ్య చేత కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్‌లో సంవత్సరానికి రూ. 20వేల కోట్లు పెడతామని అన్నారు. సివిల్ కాంట్రాక్టర్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ చేసే చివరి మోసం. 42 శాతం రిజర్వేషన్లపై ఒక్క జీవో సీఎం ఇవ్వలేదు. బీసీలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని అన్నారు. బీసీలకు ఫీరీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు అని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. వాకిటి శ్రీహరికి మత్స్య శాఖ ఇచ్చి నిధులు ఇవ్వడం లేదు. వాకిటి శ్రీహరికి హోం, రెవెన్యూ శాఖ ఇచ్చి ఉంటే మంచిగా పనిచేస్తారు. చేతి వృత్తులకు కనీస గౌరవం లేదు. ముదిరాజ్ కులస్తులను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని అంటున్నారు. వడ్డెరలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు జీవో ఇవ్వాలి. బీసీ డిక్లరేషన్ పెట్టిన నిజామాబాద్ జిల్లాలో ఒక్క బీసీకి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ ప్రతి పార్లమెంట్‌కు ఇద్దరు బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని చెప్పారు. మంత్రి పదవుల్లో, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా డిస్ ప్లే చేస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.