Singireddy Niranjan Reddy | టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమే అని తెలిపారు. తెలియకుంటే తెలుసుకోవాలని, ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని పేర్కొన్నారు. కానీ తన అజ్ఞానాన్ని సమాజం మీద రుద్దడం సంస్కార హీనత అని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు ఎవరో వచ్చి వ్యవసాయం నేర్పించలేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. భారత్లోని దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులోనూ తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. దానికి విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు , అటుపిమ్మట అసఫ్ జాహీ పాలకులు పునాదులు వేసిందని చెప్పారు. వెయ్యేళ్ల క్రితం ఈ తెలంగాణ నేల వరి పండిన ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ అని స్పష్టం చేశారు. ప్రపంచపు భారీ నీటి పారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్లో ఉన్నామని అన్నారు. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేక మంది వలస వచ్చారని.. వలసవచ్చి వారి పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఉండవచ్చని అన్నారు. ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదని.. కానీ వలస వచ్చినవాళ్లు వ్యవసాయం నేర్పారు అన్న మాటలు మాట్లాడటం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని విమర్శించారు.
జొన్నకలి జొన్నంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్
అని శతాబ్దాల కిందటే శ్రీనాథుడు తన రచనల్లో వర్ణించారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలియకుంటే పండితులను అడిగి పీసీసీ అధ్యక్షుడు తెలుసుకోవాలని హితవు పలికారు. కాలానుగుణంగా కేవలం సమైక్య రాష్ట్రంలో కలిసిన పాపానికి తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం ఛిద్రమైపోయిందని విమర్శించారు. అది మరిచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ పాట పాడే మీ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ అస్థిత్వ పతాకకు రుద్దవద్దని, అవమానించవద్దని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు భేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.