Satyavathi Rathod | హైదరాబాద్ : పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కవిత సస్పెన్షన్‌పై తెలంగాణ భవన్లో మహిళా నాయకురాళ్లతో కలిసి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కోట్ల మంది కలిసి నడిచారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కన్నబిడ్డల కంటే పార్టీ ఎక్కువని.. ఈ నిర్ణయంతో కేసీఆర్ చాటిచెప్పారు. ముందే హెచ్చరించినా కవిత తన తీరు మార్చుకోనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారు. కవిత మాటలు లక్షలాది బీఆర్ఎస్ కార్యకర్తలను బాధపెట్టాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్‌కు కుడిభుజంగా హరీశ్‌రావు ఉన్నారు. కొన్నాళ్లు కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఇప్పుడు హరీశ్‌రావుపై విమర్శలు చేశారు అని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లు మాకు అనిపిస్తోంది. కవితకు మా నాయకుడు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒకసారి ఎంపీని చేశారు.. తర్వాత ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. కేసీఆర్ కుమార్తెగా కవితకు పార్టీలో గౌరవం దక్కింది. ఇవాళ అన్ని మర్చిపోయి పార్టీ గురించి చెడుగా మాట్లాడటం సరికాదు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని ఆమె అన్నారు. నువ్వుంటే ఎంత.. పోతే ఎంత అని కార్యకర్తలు అనుకుంటున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.