Niranjan Reddy | హైదరాబాద్ : కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాంతత్య్ర దినోత్సవం సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగం? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మరి కామన్సెన్స్ ఉంటే రైతుల బాధలు తీర్చండి అని సీఎంకు నిరంజన్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆంగ్లం రాకపోవడం మూలంగానే సమాజంలోని పలు వర్గాలు వెనకబడ్డాయి అన్న దానికి అంగీకరించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే రైతుల బాధలు ఎలా తీరుస్తారో స్పష్టంచేయండి. 50 సార్లు ఢిల్లీకి వెళ్లడం మూలంగా ఏం సాధించుకుని వచ్చారు? కనీసం యూరియా తేలేకపోయారు. పరోక్ష సహకారం అందించే బీజేపీ ఎంపీలు కూడా యూరియా గురించి ఏం మాట్లాడలేదు. యూరియా తెచ్చే ప్రయత్నం కూడా చెయ్యరు అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మైత్రి జోరుగా నడుస్తున్నది. దీనిని ఎవరూ కాదనలేరు. కాళేశ్వరం, పోలవరం, బనకచర్ల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు గమనించండి. బనకచర్ల విషయంలో కనీసం డీపీఆర్ లేకుండానే కేంద్రం లోన్ ఇవ్వడానికి కేంద్రం సిద్దమయింది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు నిర్మించినా అది ఈ దేశ ప్రజల సంపద. ఐదేండ్లు ఫలితాలు ఇచ్చిన కాళేశ్వరాన్ని వినియోగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను కిందకు వదిలేస్తూ పరోక్షంగా ఏపీ ప్రాజెక్టులకు సహకరిస్తున్నది. ఐదేళ్లు ఫలితాలు ఇచ్చిన కాళేశ్వరాన్ని అక్కడ కట్టాల్సి లేకుండే అనడమే మూర్ఖత్వం. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.