Niranjan Reddy | హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించిన రైతులు, మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రావడం లేదు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపైన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, కొంత ఆర్థిక సాయం అందజేశాం. మేము రైతులను పరామర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అక్కసు వెళ్లగక్కుతుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ప్రజా పాలనలో పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిపాలన చేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
రాజ్యాంగ విలువలు పట్టించుకోకుండా.. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ. రాజకీయాలు మాట్లాడకూడని చెప్పిన స్పీకర్ రాజకీయాలు మాట్లాడుతున్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. మహాత్మా గాంధీ అబద్ధాలు చెప్పొద్దని అనేవారు.. కాంగ్రెస్ నాయకులు మాత్రం రోజు అబద్ధాలు మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందిస్తాం.. కానీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను మేము పట్టించుకోం అని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
BRS | కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం.. గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత
KTR | బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం : కేటీఆర్