హైదరాబాద్: భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన అన్నదాతలు, నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతన్నలు.. పదేండ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయంటూ మండిపడ్డారు. పాలమూరులో పల్లికి, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం రైతన్నలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయని చెప్పారు. రైదుబంధు కోసం, రైతుబీమా, రుణమాఫీ, కరెంటు, యూరియా, సాగునీటి, పంటల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏడాది పాలన.. ఎదురుచూపుల పాలన అంటూ విమర్శించారు. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జాగో రైతన్న జాగో.. జాగో తెలంగాణ జాగో అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘‘పాలమూరు లో పల్లికి మద్దతు ధరకోసం.. వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం
బయ్యారం లో కరంటు కోసం.. జగిత్యాలలో యూరియా కోసం
భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు.. నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నరు.
పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు.. నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నరు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ రైతన్నలు.. పదేళ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయి.
రైతుబంధు కోసం ఎదురుచూపులు
రైతుబీమా కోసం ఎదురు చూపులు
రుణమాఫీ కోసం ఎదురు చూపులు
కరంటు కోసం ఎదురుచూపులు
యూరియా కోసం ఎదురుచూపులు
సాగునీటి కోసం ఎదురుచూపులు
పంటల కొనుగోలు కోసం ఎదురు చూపులు
ఏడాది కాంగ్రెస్ పాలన.. ఎదురుచూపుల పాలన
ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ
జాగో రైతన్న జాగో.. జాగో తెలంగాణ జాగో’’