హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్పై కక్షతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు నీళ్లు, కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు.ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునే అవకాశం ఉన్నదని స్పష్టంచేశారు.
మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేండ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో హరీశ్‌రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని తెలిపారు. సభా సంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలను ఏమైనా అంటే బీజేపీ నేతలకు రోషం పొడుచుకొస్తున్నదని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ హామీల కోసం బీజేపీ పోరాడుతుంటే, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ 72 రోజుల పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప కొత్తగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలకు కావాల్సినన్ని నిధులు బడ్జెట్లో కేటాయించలేదని మండిపడ్డారు.
మంత్రులు సోయితో మాట్లాడాలి
వనపర్తి రాజులు కట్టిన సరళాసాగర్ ప్రాజెక్టును నిజాం నవాబులు కట్టారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒడిశా నుంచి కూనవరం మీదగా గోదావరిలో కలిసే శబరి నదికి, కాళేశ్వరానికి సంబంధమేమిటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టి శబరికి అన్యాయం చేశారనడంతో అర్థం లేదని ఎద్దేవా చేశారు. మంత్రులు సోయితో మాట్లాడాలని సూచించారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. సమావేశంలో శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత మేడిపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతు భరోసా ఇస్తరా? ఇవ్వరా?
ప్రస్తుతం రాష్ట్రంలో మూడెకరాలకు మించి రైతుబంధు ఇవ్వలేదని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుభరోసా అమలు చేస్తారా? చేయరా? ఎకరాకు రూ.15 వేల హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆలేరు మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తరలించడం మంచి పద్ధతికాదని, చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.