Niranjan Reddy | హైదరాబాద్ : కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కార్పోరేట్ల తరపున తప్ప సామాన్యుల తరపున ఆలోచన చేయడం లేదని ధ్వజమెత్తారు. తమకు తోచిందే అమలు చేస్తాం .. అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతాం అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది తప్పితే ప్రస్తుత తరం తరపున ఆలోచన చేయడం లేదు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతి చర్చలు చేయాలని కోరడం జరిగింది. మన దేశ పౌరులను మనమే కాల్చుకోవడం మంచిది కాదని కేంద్రానికి వివరించినా వారు ఎందుకో ఈ దిశగా ఆలోచించడం లేదు. వ్యవస్థలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి.. వాటిని సహించం అనడం మంచి పద్దతి కాదు. ముకుళిత హస్తాలతో విన్నవిస్తున్నాం.. మావోయిస్టులతో చర్చలు జరపాలి. బీజేపీ కాంగ్రెస్ రహిత భారతదేశం అని పిలుపునిచ్చింది .. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు చేరుకున్నది అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
2026 మార్చి వరకు మావోయిస్టులను ఏరివేస్తాం అన్న నిర్ణయం సరికాదు.. వ్యక్తులను నిర్మూలించడం ద్వారా ఆలోచనలను నిర్మూలించలేరు. ఉన్నత విద్యావంతులు ఎంతో మంది అటు వైపు ఆకర్షించబడుతున్నారు అన్న విషయం ఎందుకు కేంద్రం ఆలోచించడం లేదు..? అక్కడ చంపుతున్న జ్ఞాన సంపదను తిరిగి మనం ఎలా సాధించగలం..? 22 విద్యార్థి సంఘాలు చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు.. అనేక పార్టీలు, ప్రజాసంఘాలు చర్చలు జరపాలని కోరుతున్నాయి. కానీ కేంద్రం కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తామని కూడా ప్రకటించడం లేదు ఎందుకు..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
ఉగ్రవాద మూకలను ఏరివేయాలని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఏకతాటిపై నిలబడి కేంద్రానికి, మన సైన్యానికి మద్దతు ఇచ్చింది. కానీ అమెరికా అధ్యక్షుడు రెండు దేశాలను ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాం అని ప్రకటించాడు. మరి దేశంలోని మావోయిస్టులతో ఎందుకు కేంద్రం చర్చలు జరపడం లేదు..? మావోయిస్టుల మూలంగా అభివృద్ధి ఆగిపోయింది అన్న వాదన అసంబద్దమైనది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నాలుగు దశాబ్దాల మావోయిస్టులు ఉన్నారు.. అంతకుముందు మూడు దశాబ్దాలు అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నారు..? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.