Niranjan Reddy | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్‌ను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మాజీ మంత్రి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. గత సంవత్సరం నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ సంవత్సరం వానాకాలం పంటకు సంబంధించి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని అయితే రైతులు ఇప్పటివరకు 14900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి వినియోగించుకున్నారని ఈ సందర్భంగా కలెక్టర్‌కు గుర్తు చేశారు. ఇంకా పదివేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అత్యవసరమని చెప్పారు.
జూరాల గేట్లకు సంబంధించి రోప్‌లు తెగి గేట్లకు ప్రమాదం పొంచి ఉన్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రాజెక్టు పరిశీలన చేసి ఇందుకు కావలసిన ప్రతిపాదనలు పంపాలని అధికారుల ఆదేశించారని చెప్పారు. అధికారులు వీటి మరమ్మతుల కొరకు సుమారు నాలుగు కోట్ల అవసరమవుతుందని ప్రతిపాదనలు పంపి రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్న పూర్తి స్థాయిలో ర్యాలంపాడు సంఘాల తాటికుంట, నాగర్ దొడ్డి తదితర రిజర్వాయర్లు నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని నదులు పొంగిపొర్లుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపాలన్న ధ్యాస లేదన్నారు. వ్యవసాయ రంగంలో దేశమంతా తెలంగాణ వైపు చూసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తే నేటి ప్రభుత్వం రైతులను బజారున పడేసిందన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా, జూరాల గేట్లు మరమ్మత్తు తదితరులు చేపట్టాలని లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి వెంట గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాస హనుమంతు నాయుడు తదితరులు ఉన్నారు.