Niranjan Reddy | హైదరాబాద్ : పక్క రాష్ట్రం నుండి వచ్చిన రోజు కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ 9 మందిని కాపాడి హీరో అయ్యాడు.. ముగ్గురు మంత్రులు, ప్రభుత్వం జీరో అయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వరదలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర కేబినెట్లో మిగిలిన ఆరు మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. భర్తీ చేసినప్పుడు సుభాన్ లాంటి ఒక దృఢమైన వ్యక్తిని మంత్రిగా పెట్టుకోండి.. ప్రజలకు ధైర్యాన్ని ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు వరదల గురించి పట్టించుకోలేదు. మూడోరోజు తీరిగ్గా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతను విమర్శించడం సిగ్గుచేటు. వరద బాధితులకు సాయం గురించి అధికారులతో సమావేశం పెట్టి ప్రతిపక్షాన్ని నిందించడం ఏమిటి? కేసీఆర్ కనిపించడం లేదని చెప్పడం ఆశ్చర్యకరం. కేసీఆర్ వ్యక్తి కాదు.. కేసీఆర్ ఒక వ్యవస్థ. తెలంగాణ ప్రతి అభివృద్దిలో, నీళ్లలో, పంటలలో కేసీఆర్ ఉంటారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఖమ్మంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు, నేతలు ప్రజలకు సాయం చేయడంలో ముందున్నారు.. అది మానవీయ కోణంలో చేస్తున్న పని.. వరద బాధితులకు అండగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు మానవీయ దృక్ఫదంతో పనిచేయాలి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఆ కోణం లేదు. వరదల గురించి వాతావరణ శాఖ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు పొలాలకు మందు కొట్టే విషయంలో కూడా ముందుచూపుతో వ్యవహరిస్తారు. వరద బాధితులు హాహాకారాలు చేస్తుంటే.. మంత్రులు, సీఎం తలోరకంగా మాట్లాడుతున్నారు. ముగ్గురు మంత్రులు విఫలమయ్యారని ప్రజలే చెబుతున్నారు .. ప్రజలు మీకు నవరంధ్రాలలో ఏం పోస్తున్నారో సీఎం గమనించాలి. హైదరాబాద్ నుండి కదలకుండానే సీఎం వరద ప్రాంతాలను పీఎం సందర్శించాలని చెప్పడం ఆశ్చ్యర్యకరమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలుకాక ప్రజలు బాధపడుతున్నారు. రుణమాఫీ విషయంలో మంత్రులకే స్పష్టత లేదు. మంత్రులు హెలికాప్టర్ లేదని చెప్పడం దురదృష్టకరం. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక, చిత్తశుద్ధి లేకనే వరదల్లో ప్రజలు నష్టపోయారు. వరదల్లో చనిపోయిన వారికి రూ.5 లక్షలు గతంలో ఉన్నదే.. గతంలో రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ ఇప్పుడు దానిని అమలు చేయాలి. రేవంత్ ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారం దక్కిన తర్వాత ఒకమాట మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో రాష్ట్రానికి రాసిన లేఖలో రూ.1300 కోట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.. క్షేత్రస్థాయికి సంబంధించిన సమాచారం రాష్ట్రం పంపలేదని స్పష్టం చేసిందని నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Parthasarathy Reddy | ఖమ్మం వరద బాధితులకు రూ. కోటి విరాళం అందజేసిన ఎంపీ పార్థసారథి రెడ్డి
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
SIMBA is Coming | ‘సింబా’ వచ్చేస్తున్నాడు.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రశాంత్ వర్మ పోస్ట్.?