హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని మెచ్చుకున్న నీటిపారుదల శాఖ మంత్రికి.. మిగిలిన 10శాతం పనుల పూర్తికి మరో రెండేండ్ల సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై కేవలం సమీక్షలు చేస్తే సరిపోదని దుయ్యబట్టారు. సాగదీత కోసమే నీటిపారుదల శాఖ మంత్రి పాలమూరులో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని మండిపడ్డారు.
పాలమూరు బిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ ప్రాంత ప్రాజెక్టుల పనులు చేపట్టకపోవడం సొంతగడ్డకు ద్రోహం చేసినట్టు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ-3లో 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలిపోయిందని, అది కూడా ఆలస్యమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దాని కాంట్రాక్టు ఆంధ్రా పార్టీకి చెందిన వారికి దక్కిందని, బహుశా ఆంధ్రా పాలకుల ఒత్తిడితో ఆలస్యమవుతుందేమోనని అనుమానం వ్యక్తంచేశారు. డిండికి గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని, అది కూడా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మేరకే ఖర్చవుతుందని తాము చెప్తుంటే, దానిని కాంగ్రెస్ సర్కారు పెడచెవిన పెడుతుందని ధ్వజమెత్తారు. పాలమూరు పనులను పక్కనబెట్టి, డిండి పనులను ఎందుకు హడావుడిగా చేపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయని నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుభరోసా ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని, రుణమాఫీ సగం మందికి కూడా కాలేదన్న విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్న విషయాన్ని సర్కారు గమనంలోకి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన బోనస్ ఎంత? కొన్న ధాన్యం ఎంతో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ, హైడ్రాతో రాబడులను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఈ నెల 7న ఫైనల్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం కానున్నదని, అయితే ఈ ఉత్తర్వులపై బీఆర్ఎస్ తరఫున అభ్యంతరాలు వ్యక్తంచేశామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ ఒప్పుకుంటే ఆల్మట్టిలో 160 టీఎంసీల నీటిని నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుందని, దీంతో తెలంగాణకు నీళ్లు రావడం గగనమే అని, ఫలితంగా జూరాల ప్రాజెక్టు వట్టిపోవడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టాలని ఆయన సర్కారుకు సూచించారు.