Niranjan Reddy | హైదరాబాద్ : మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు..? ఎందుకు నక్సలిజం విస్తరించలేదు..? రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా భావించి ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా పరిష్కారం చూయించాం.. ఇది దేశవ్యాపితంగా ఇది అమలు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యం ఉన్న దేశాలలో పోటీ పడి ఆర్థిక సంపదను పెంచుకుని, ప్రజల పాత్రను, ప్రజల ఆస్తులను పెంచిన దేశాలు ఆర్థికమాంద్యాలను తట్టుకుని నిలబడుతున్నాయి.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని నిరంజన్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు, సింగరేణి ప్రైవేటీకరణకు ఒప్పుకోలేదు.. భారీ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన పంప్‌ల తయారీ అవకాశం ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ సంస్థకు మాత్రమే అప్పగించారు. మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు. రాష్ట్రంలోని కోటీ 50 లక్షల ఎకరాల భూమిలో 92.5 శాతం ఐదెకరాల లోపు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రతి చేతికి పని వచ్చింది కాబట్టే .. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.90 వేల నుండి రూ.3.12 లక్షలకు చేరింది. దేశంలోని ప్రజల యొక్క మౌళిక సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి… దానినే మావోయిస్టులు ప్రశ్నిస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో మావోయిస్టులు ప్రభావం చూయిస్తున్నది ఆరు రాష్ట్రాలు మాత్రమేనని కేంద్రం చెబుతున్నది.. మరి దేశంలోని మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు..? మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇచ్చిన ప్రకటనలలో గుజరాత్ మోడల్ అంటూ విద్యుచ్చక్తి అంశాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.. 2014 నాటికి గుజరాత్‌ను సంపూర్ణ విద్యుద్దీకరణ చేశాం అని గొప్ప విజయంగా ప్రకటించారు. 2014 కు పూర్వం మూడున్నర దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుద్దీకరణ పూర్తయింది. మోడీ ఇచ్చిన హామీలు నల్లధనం, ప్రతి ఒక్కరి ఖాతాకు రూ.15 లక్షలు అన్న వాటిని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎదుటి వ్యక్తులను బాధ్యులుగా చేసి ముందుకుపోతాం అని చెప్పడం విచారకరం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి చేయడానికి సాకులు వెతకకుండా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తాం అంటే అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది.. వ్యవస్థ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ఒకప్పుడు వచ్చిన తీర్పును దేశం మొత్తం కీర్తించింది.. ప్రధాని విద్యార్హతలను ప్రశ్నించిన యువకుడి మీద కేసు పెట్టి జైలుకు పంపారు. ఆధునిక యుగంలో ఎంతో పరిపక్వత ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వాల నియంత పోకడలు చెల్లవు. తెలంగాణ రైతాంగ పోరాటంలో రైతులను, యువతను పొట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నెహ్రూ ప్రభుత్వానిది. చట్టబద్ద పాలన ముసుగులో ప్రజలను వంచించడం పాలకులకు చెల్లదు అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
1969లో తెలంగాణ ఉద్యమంలో 369 మందిని ఇందిరాగాంధీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది.. ఎమర్జెన్సీలో అనేక మంది విద్యార్థి నేతలను చంపింది. ఈ దేశంలో ఎన్కౌంటర్లను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ.. క్రూరంగా హింసించి అణచివేసింది. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని టెర్రరిస్టులతో చేతులు కలిపిన వారు చంపేశారు.. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సిక్కు సమాజానికి ఆపాదించి 4 వేల మంది సిక్కులను ఊచకోత కోసింది. 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు ఆత్మాహుతి దళంగా ఏర్పడి రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఎన్టీ రామారావు ఆస్తులను, సినిమా టాకీసులను తగులబెట్టింది. ఎల్టీటీఈ చేసిన దానికి ఎన్టీఆర్ ఆస్తులకు ఏం సంబంధం.. తమకు నచ్చని వారి మీద దాడులు చేసే సంస్కృతికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీనే అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి పోటో పెట్టాలని కాంగ్రెస్ దాడికి దిగడం దేనికి సంకేతం. గత ప్రభుత్వంలో సీఎస్ఆర్ నిధులు, స్వంత డబ్బులతో కేటీఆర్ పుట్టినరోజు సంధర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద ఏడు అంబులెన్సులను సమకూర్చాం.. దానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు.. కానీ ప్రభుత్వం మారగానే వాటి మీద రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టారు. ప్రభుత్వాల తప్పిదాలను సమాజం హర్షించదు.. చరిత్ర క్షమించదు అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
నల్లచట్టాలకు వ్యతిరేకంగా 16 నెలల పాటు ఢిల్లీ చుట్టూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం చారిత్రాత్మకమైనది.. ఇందులో 700 మంది చనిపోవడం బాధాకరం. వారితో చర్చలు జరపకుండా ఆ ఉద్యమాన్ని కూడా కించపరిచారు.. అది దేశవ్యాప్తం అవుతుంది అన్న విషయం తెలుసుకుని ప్రధానమంత్రి దేశానికి క్షమాపణలు చెప్పారు. ఆపరేషన్ కగార్ విషయంలో కూడా అలాంటి తప్పిదానికి కేంద్రం పాల్పడకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలి. ప్రపంప వ్యాప్తంగా ఎక్కడా సాయుధ పోరాటాలు విజయవంతమైన చరిత్ర లేదు.. మావోయిస్టులు కూడా ఈ విషయంలో ఆలోచించి ముందుకు రావాలి. ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా ఎదిగేలా చూడాలని కోరుకుంటున్నాం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.