Rythu Bharosa | యాసంగి పంటకు ఎకరాకు రూ.10వేలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15వేలు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వానాకాలం విడత వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదని మండిపడ్డారు. రుతుపవనాలకు ముందు వర్షాలు కురిసి ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ రైతు భరోసా అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయడం లేదని విమర్శించారు. రైతుబంధు లక్ష్యంగా చేసుకుని అధికారంలో ఉన్న వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి సాగుకు యోగ్యమైందేనన్నారు. ప్రతి రైతు ఆధీనంలో ఉన్న భూమిని రుజువు చేస్తూ పట్టేదార్ పాసుపుస్తకాల ఆధారంగా రైతులందరికీ రైతు బంధు సహాయం అందించడం జరిగిందన్నారు. పంటలు పండించడానికి రైతులను ప్రోత్సహించడానికి పెట్టుబడి సాయం అందించామని.. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మంది రైతులు ఐదెకరాలు, అంతకంటే తక్కువ భూమి కలిగి ఉన్నారు. ఐదు నుంచి ఏడు ఎకరాలు కలిగి ఉన్న వారు ఏడుశాతం కంటే తక్కువగా ఉన్నారని చెప్పారు. 20 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు కేవలం 6,488 మంది మాత్రమే ఉన్నారన్నారు. ప్రస్తుత వనకాలం సీజన్లో పంట పెట్టుబడికి మద్దతుగా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా రైతులకు చెల్లించాలన్నారు.
రుణమాఫీ హామీపై ప్రభుత్వం కేబినెట్లో చర్చ కొనసాగుతోందని.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ఆగస్టు 15కు మార్చారని, హామీల అమలులో కాలయాపన చేయడం, కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా మారిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రుణమాఫీ కాకుండా మిగిలింది రూ.4వేల కోట్లు మాత్రమేనని, కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీని రేవంత్‌రెడ్డి తక్కువ చేసి చూపుతున్నారన్నారు. రూ.2లక్షల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రుణమాఫీ జరిగిందన్నట్లు మీడియా సంస్థలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్‌లైన్ పెట్టారని, అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని.. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా? అని నిలదీశారు. రైతు భరోసాకు అర్హులను ఇప్పటి వరకు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. 68.90 లక్షల మందికి 1.52 కోట్ల ఎకరాలకు 11 విడతల్లో రూ.72వేల కోట్లను కేసీఆర్ హయాంలో రైతుబంధు కింద ఇచ్చామని, 2,603 క్లస్టర్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ప్రతి క్లస్టర్లో 5వేల ఎకరాలు ఉంటాయని.. డేటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందని, రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమేనని నేతలు మండిపడ్డారు.